మూడో వన్డేలో భారత జట్టు భారీ విజయం సాధించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఇండియా 317 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తుగా ఓడిచింది. పేసర్ మహమ్మద్ సిరాజ్ ధాటికి శ్రీలంక టాపార్డర్ కుప్పకూలింది. అతని పేస్ దెబ్బకు టపటపా వికెట్లు కోల్పోయింది.
కీలకమైన నవనిదు ఫెర్నాండో (19), కుశాల్ మెండిస్ (4), ఆవిష్క ఫెర్నాండో (1) చరిత అసలంక (1)లను సిరాజ్ అవుట్ చేయడంతో లంక కోలుకోలేకపోయింది. ఆ తర్వాత షమీ, కుల్దీప్ యాదవ్ వికెట్ల వేట కొనసాగించారు. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఓవర్లో లంక కెప్టెన్ దసున్ షనక బౌల్డ్ అయ్యాడు.
16 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్లు కోల్పోయింది. 22వ ఓవర్ చివరి బంతికి కుమరను కుల్దీప్ బౌల్డ్ చేయడంతో 73 పరుగులకే లంక ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో సిరాజ్ 4 వికెట్లు, షమీ, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు.
దాంతో, మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో టీమిండియా గెలుచుకుంది. ఈ సిరీస్‌లో రెండు శతకాలు బాదిన విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 390 పరుగులు చేసింది.
ఓపెనర్ శుభ్‌మన్ గిల్(116), విరాట్ కోహ్లీ (166)లు సెంచరీలతో చెలరేగారు. వీళ్లిద్దరూ ఫోర్లు, సిక్సర్లు బాదుతూ లంక బౌలర్లపై విరుచుకుపడ్డారు. హాఫ్ సెంచరీ తర్వాత వేగం పెంచిన కోహ్లీ 106 బంతుల్లోనే 150 పరుగులు సాధించాడు. భారత గడ్డ మీద తక్కువ బంతుల్లో 150 స్కోర్ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
ఓపెనర్ రోహిత్ శర్మ (42), అయ్యర్ (38), రాహుల్ (7), సూర్య (4) తక్కువ స్కోర్‌కే వెనుదిరిగారు. లంక బౌలర్లలో లహిరు కుమార రెండు వికెట్లు పడగొట్టాడు. కరుణరత్నే, కసున్ రజిత తలా ఒక వికెట్ తీశారు.