తెలంగాణ సహా ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో 9 రాష్ట్రాల్లో ఒక్క చోట కూడా ఓడిపోకూడదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తమ పార్టీ నాయకులకు స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా మూడోసారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టేందుకు ఈ రాష్ట్రాల ఎన్నికల్లో గెలవడం అత్యంత కీలకమని పేర్కొన్నారు.
ఎన్నికల వ్యూహాలు రచించేందుకు రెండ్రోజులు జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు సోమవారం ఢిల్లీలోని ఎన్డీఎంసీ కన్వెన్షన్ హాలులో ప్రారంభమయ్యాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం తర్వాత పార్టీ నిర్వహిస్తున్న ప్రధాన కార్యక్రమమిదే.
జాతీయ అధ్యక్షుడు ప్రధాని మోదీ, పార్టీ ఉపాధ్యక్షులు వసుంధరరాజె, రమణ్‌సింగ్, రాధామోహన్‌సింగ్, సౌదాసింగ్, ప్రధాన కార్యదర్శులు బీఎల్ సంతోష్ (సంస్థాగత వ్యవహారాలు), అరుణ్‌సింగ్, దుష్యంత్ గౌతమ్, తరుణ్ ఛుగ్, సీటీ రవి, రాష్ట్రాల అధ్యక్షుడు, మోర్చాల అధ్యక్షులు హాజరయ్యారు. తొలిరోజు సమావేశంలో చర్చించిన వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సీనియర్ నేత రవిశంక ప్రసాద్ విలేకరులకు వెల్లడించారు.
నడ్డాను జాతీయ అధ్యక్షుడిగా కొనసాగించే విషయమై సోమవారం ఎలాంటి చర్చా జరగలేదని చెప్పరు. ‘2024 ఎన్నికల ముంగిట పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు పలు కార్యక్రమాలు చేపట్టినట్టు నడ్డా తెలియజేశారని, ప్రధాని మోదీ సారథ్యంలో భారత పురోగతిని ఆయన ప్రశంసించారని తెలిపారు.
” ఐదో ఆర్థిక శక్తిగా.. మొబైల్ ఫోన్ల ఉత్పాదనలో రెండో అతిపెద్ద ఉత్పత్తిదారుగా, ఆటో రంగంలో మూడో అతిపెద్ద మాన్యుఫ్యాక్చరర్‌గా దేశం అవతరించింది. రోజుకు 37 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోంది. గతంలో ఇది 12 కిలోమీటర్లు మాత్రమే. ఉచిత రేషన్ సహా పలు సంక్షేమ పథకాలతో పేదలకు సాధికారత అందిస్తున్నాం” అని నడ్డా వివరించారు.
గుజరాత్ ఎన్నికల్లో అసాధారణ, చరిత్రాత్మక విజయం సాధించామని, 182 అసెంబ్లీ స్థానాల్లో 156 గెలవడం గొప్ప విజయం అని కొనియాడారు. అయితే, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఓడిపోయినా కాంగ్రెస్, బీజేపీ మధ్య ఓట్ల తేడా ఒక శాతం కంటే తక్కువేనని నడ్డా గుర్తుచేశారు. తొలి రోజు కర్ణాటక, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాలకు సంబంధించి పార్టీ సీఎంలు, అధ్యక్షులు సమర్పించిన నివేదికలపై కార్యవర్గం విస్తృతంగా చర్చించింది.
మంగళవారం తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో అవలంబించాల్సిన వ్యూహాలపై చర్చలు జరుగుతాయని పార్టీ వర్గాలు తెలిపాయి. 9 రాష్ట్రాల్లో 72 వేల బూత్‌లలో పార్టీ బలహీనంగా ఉన్నదని, కష్టపడి పనిచేస్తే అన్ని రాష్ట్రాల్లో విజయం ఖాయమని నడ్డా తెలిపారు. 2023 బీజేపీకి అత్యంత ముఖ్యమైన సంవత్సరమని పేర్కొన్నారు.
కాగా,
కేంద్ర న్యాయ మంత్రి కిరెన్ రిజిజు రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టారు. 9 రాష్ట్రాల గెలుపుపైనే ప్రధానంగా ప్రస్తావించారు. గుజరాత్ ఎన్నికల్లో పార్టీ వరుసగా ఏడోసారి ఘన విజయం సాధించిందని.. 53 శాతం ఓట్లు సాధించిందని తెలిపారు. ఆ రాష్ట్రంలో 13 ఎస్సీ సీట్లలో 11, 27 ఎస్టీ సీట్లలో 23 సీట్లు గెలుచుకున్నామని.. ఈ కోవలోనే అన్ని రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించాలని తీర్మానం పిలుపిచ్చింది.
‘ప్రధానిని అప్రతిష్ఠ పాల్జేయడానికి ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. పెగాసస్ స్పైవేర్‌తో ప్రతిపక్షాలపై నిఘా పెట్టారని.. రాఫెల్ ఫైటర్ల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారని, మనీలాండరింగ్ కేసులో ఈడీని దుర్వినియోగం చేశారని, ఫెడరల్ వ్యవస్థకు విఘాతం కల్పించారని, ఆర్థికంగా బలహీన వర్గాలకు రిజర్వేషన్లు చెల్లనేరవని, పెద్ద నోట్ల రద్దు సరైంది కాదన్న విషప్రచారాన్ని సుప్రీంకోర్టు సైతం తిప్పకొట్టింది’ అని తెలిపారు.
అయినా ప్రతిపక్షాలు మోదీ వ్యతిరేక ప్రచారం ఆపడం లేదని, దుర్భాషలాడుతూ దాడులు చేస్తున్నాయని విమర్శించారు. షాంఘై కార్పొరేషన్, జీ-20 సమావేశాల ద్వారా భారత ప్రతిష్ఠ అంతర్జాతీయంగా ఇనుమడించిందని పేర్కొంటూ . ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా భారత దేశ వారసత్వాన్ని మోదీ పరిరక్షిస్తున్నారని తీర్మానం ప్రశంసించింది. రాజకీయ తీర్మానాన్ని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి గోవింద్ ఖర్జూరే సమర్థించారు.
హస్తినలో.. మోదీ భారీ రోడ్ షో
బీజేపీ జాతీయ కార్యవవర్గ సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ ఢిల్లీలో భారీ రోడ్ షో నిర్వహించారు. సోమవారం పార్లమెంటు స్ర్టీట్‌లోని పటేల్ చౌక్ నుండి న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) సమావేశ కేంద్రం వరకు సుమారు కిలోమీటరు మేర రోడ్‌షో జరిగింది. రోడ్డుకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో మోహరించిన ప్రజలు, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పూలవర్షం కురిపించారు.