బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలాన్ని పొడిగించింది అధిష్టానం. మంగళవారం జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ తీర్మానం చేసారు. ఈ నెల 20న నడ్డా పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు.
పార్టీ నిర్ణయం మేరకు నడ్డా 2024 జూన్ వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది అత్యంత ముఖ్యమైన లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని నడ్డాను కొనసాగించాలని జాతీయ కార్యవర్గం నిర్ణయించింది.
ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ నడ్డా అధ్యక్షతన 2024 లోక్ సభ ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. నడ్డా నాయకత్వంలో మంచి విజయాలను సాధించామని పేర్కొంటూ తెలంగాణ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో పార్టీ బలోపేతమయిందని తెలిపారు. తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చే శక్తి కేవలం బీజేపీకి మాత్రమే ఉందని స్పష్టం చేశారు.
‘‘కొరోనా మహమ్మారి వల్ల సంస్థాగతంగా పార్టీ బూత్ లెవెల్ ఎన్నికలను కూడా నిర్వహించలేకపోయాం. ఆ ప్రభావం అధ్యక్ష ఎన్నికలపై కూడా పడింది. అందువల్ల, జూన్ 2024 వరకు పార్టీ అధ్యక్షుడిగా జేపీ నడ్డానే కొనసాగించాలని జాతీయ కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించాం’’ అని అమిత్ షా వివరించారు. దేశంలో పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా నడిచే పార్టీ బీజేపీ మాత్రమేనని స్పష్టం చేసారు.
జేపీ నడ్డా బీజేపీ అధ్యక్ష బాధ్యతలను 2020 జనవరిలో స్వీకరించారు. అప్పటివరకు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షాను కేంద్ర హోం మంత్రిగా నియమించడంతో నడ్డాకు అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. మొదట వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించి, ఆ తరువాత, మూడేళ్ల కాల పరిమితితో పూర్తి స్థాయి బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుత కొనసాగింపుతో, జూన్ 2024 వరకు జేపీ నడ్డానే అధ్యక్షుడిగా ఉంటారు. అంటే, 2024లో జరిగే లోక్ సభ ఎన్నికలకు బీజేపీ నడ్డా నాయకత్వంలోనే వెళ్తుందని స్పష్టమవుతుంది.