2024 ఎన్నికలు తరుముకు వస్తున్నాయని, అంతా ఎన్నికలకు సిద్ధం కావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్టీ నాయకులకు సూచించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ కమిటీ సమావేశాలను ఉద్దేశించి మోదీ మంగళవారం ప్రసంగిస్తూ లోక్ సభ ఎన్నికలకు ఇంకా 400 రోజులు మాత్రమే ఉన్నాయని, నేతలంతా ఓటర్లను కలవాలని దిశానిర్ధేశం చేశారు.
ముఖ్యంగా 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సున్న యువతకు దగ్గర కావడానికి కృషి చేయాలని పేర్కొన్నారు. ‘గత ప్రభుత్వాల పాలనపై, వారు చేసిన నష్టంపై 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సున్న యువతకు పెద్దగా అవగాహన ఉండదు. వారికి ఆ అవగాహన కల్పించాలి. బీజేపీ అందిస్తున్న సుపరిపాలన కొనసాగాల్సిన అవసరాన్ని వారికి వివరించాలి’ అని మోదీ తెలిపారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించాలని బీజేపీ బీజేపీ నాయకులకు పిలుపునిచ్చారు.
మైనారిటీలతో సహా సమాజంలోని ప్రతి వర్గానికీ చేరువ కావాలని చెబుతూ ఎన్నికలతో సంబంధం లేకుండా ప్రజల కోసం పని చేయాలని కోరారు.గెలుపు పట్ల మితిమీరిన విశ్వాసం వలదని పార్టీ శ్రేణులను హెచ్చరించారు. మధ్యప్రదేశ్లో దిగ్విజయ్ సింగ్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నప్పటికీ 1998లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పార్టీ అభివృద్ధి అజెండాను దెబ్బతీసేలా.. సినిమాల వంటి అసంబద్ధమైన విషయాలపై అనవసర వ్యాఖ్యలు చేయవద్దని కార్యకర్తలకు సూచించారు.
భారతదేశంలో ప్రస్తుతం స్వర్ణయుగం నడుస్తోందని, ఇదే అత్యుత్తమ కాలమని ప్రధాని మోదీ అభివర్ణించారు. దేశ అభివృద్ధి కోసం అంతా కృషి చేయాలని కోరుతూ ప్రజలంతా దేశాభివృద్ధికి అంకితం కావాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపిచ్చారు. బీజేపీ ఇప్పుడు కేవలం ఒక రాజకీయ ఉద్యమం కాదని, బీజేపీ ఇప్పుడు ఒక సామాజిక ఉద్యమంగా మారిందని ప్రధాని వివరించారు.
‘ప్రస్తుతం కొనసాగుతున్న అమృత కాలాన్ని కర్తవ్య కాలంగా మార్చుకోవాలి. అప్పుడే దేశాభివృద్ధి వేగవంతం అవుతుంది’ అని చెప్పారు. సరిహద్దు గ్రామాలకు వెళ్లాలని, అక్కడి ప్రజలకు బీజేపీని దగ్గర చేయాలని ప్రధాని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు వారికి చేరేలా చూడాలని పేర్కొన్నారు.
‘‘భారత్ అత్యుత్తమ శకంలోకి రాబోతున్నది. దేశ అభివృద్ధి కోసం పార్టీ తనను తాను అంకితం చేసుకోవాలి. అమృత కాలాన్ని.. కర్తవ్య కాలంగా మార్చుకోవాలి’’ అని పార్టీ కార్యకర్తలకు ప్రధాని హితబోధ చేశారు. 2024 లోక్సభ ఎన్నికలకు సుమారుగా 400 రోజులే ఉన్నాయని.. నేతలు ప్రతి వర్గానికి పూర్తి అంకితభావంతో సేవ చేయాలని చెప్పారు. పార్టీని విస్తరించి, దేశాన్ని ప్రతి అంశంలో నడిపించాలని అన్నారు. వివిధ రంగాలకు చెందిన నిపుణులను కలవాలని, వారితో కనెక్ట్ కావడానికి యూనివర్సిటీలు, ఇతర ప్రదేశాలను సందర్శించాలని కోరారు.