ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరగాల్సిన మహిళల జాతీయ రెజ్లింగ్ కోచింగ్ క్యాంపును రద్దు చేశారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆ ఈవెంట్ జనవరి 18వ తేదీ నుంచి జరగాల్సి ఉంది. సుమారు 41 మంది రెజ్లర్లు, 13 మంది కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్ ఆ క్యాంపులో పాల్గొనాల్సి ఉంది.
కానీ ఆ ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌పై మహిళా రెజ్లర్లు లైంగిక ఆరోపణలు చెలరేగడంతో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తున్నది.
స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన ప్రదర్శన కూడా చేపట్టారు. బ్రిజ్ భూషణ్‌తో పాటు అనేక మంది కోచ్‌లు లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నారని వినేశ్ ఆరోపించారు. ఈ ఆందోళనలో వినేశ్ పోగాట్, సాక్షిమాలిక్, సంగీతా ఫొగాట్, సోనమ్ మాలిక్, సరితా మోర్, అన్షు, భజరంగ్ పూనియాతోపాటు 30మంది స్టార్ రెజ్లర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వినేశ్ మీడియాతో మాట్లాడుతూ.. బ్రిజేశ్, కోచ్‌ల లైంగిక వేధింపులు తట్టుకోలేక తాను ఓసారి ఆత్మహత్య చేసుకోబోయానని, ఎందుకూ పనికిరావని ఎంతో మానసిక క్షోభకు గురి చేసేశారంటూ కన్నీళ్లు పెట్టుకుంది. జాతీయ శిబిరాల్లో ఏళ్ల తరబడి కొనసాగుతున్న కొందరు కోచ్‌లు మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నారని, అందులో బ్రిజ్ భూషణ్ శరణ్ కూడా ఒకరని తెలిపారు.
చాలామంది యువ రెజ్లర్లు తనవద్దకు వచ్చి ఏడ్చేవారని, తనకు తెలిసినంతవరకు 20మంది బాలికలు జాతీయ శిబిరంలో లైంగిక వేధింపులకు గురౌతున్నట్లు తెలిపారని భావోద్వేగానికి లోనయ్యారు. ఈ విషయాన్ని ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక బాధపడేవారని, ఎవరికైనా ఫిర్యాదు చేసినా ఎవ్వరూ పట్టించుకునేవారు కాదని ఆమె తెలిపారు. తమ గాయాల గురించి అస్సలు పట్టించుకోరని, వారిపై ఫిర్యాదు చేసినందుకు వెళ్తే.. చంపేస్తానంటూ బెదిరింపులు కూడా వచ్చాయి” అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంది.
ఈ ఘటన పట్ల కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ స్పందిస్తూ భారత రెజ్లింగ్ సమాఖ్య వివరణ ఇవ్వాలని కోరింది. 72 గంటల్లోనే సమాధానం ఇవ్వాలని క్రీడాశాఖ ఆదేశించింది.