రాజ్‌భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. జాతీయ పతాకాన్నిగవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆవిష్కరించారు. అనంతరం సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. అంతకుమందు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రిపబ్లిక్ డే కార్యక్రమంలో గవర్నర్‌తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్ పాల్గొన్నారు.
తెలుగులో ప్రసంగం ప్రారంభించిన గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం మనది. మేధావులు, మహోన్నత వ్యక్తులు మన రాజ్యాంగాన్ని రూపొందించారు. రాజ్యాంగ రచనలో డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ ఎంతో అంకితభావం కనబరిచారు. ఆ రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిందని పేర్కొన్నారు.
తెలంగాణకు ఘనమైన, విశిష్టమైన చరిత్ర ఉందని చెబుతూ శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్ ఎన్నో రంగాల్లో దూసుకుపోతోందని ఆమె కొనియాడారు. వైద్యం, ఐటీ రంగాల్లో భాగ్యనగరం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందని.. దేశంలోని అన్ని నగరాలకు హైదరాబాద్ అనుసంధానమై ఉందని ఆమె తెలిపారు.
రాష్ట్రాభివృద్ధికి అవసరమైన సహకారాన్ని రాజ్‌భవన్ అందిస్తోందని చెబుతూ గిరిజన ప్రాంతాల్లో రాజ్‌భనన్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని, వారిలో పోషకాహార సమస్య నివారణకు కృషి చేస్తుందని గవర్నర్ తమిళిసై వెల్లడించారు. “కొంతమందికి నేను నచ్చకపోవచ్చు..కొందరికి నచ్చకపోయినా తెలంగాణ అభివృద్ధికి కృషిచేస్తా” అంటూ ఆమె కేసీఆర్ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
కేంద్ర అభివృద్ధి కార్యక్రమాలను ప్రశంసిస్తూ గవర్నర్ ప్రసంగం కొనసాగింది. తెలంగాణలో పెద్ద ఎత్తున జాతీయ రహదారులను నిర్మించిన ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. వందే భారత్ రైలు కేటాయించినందుకు కృతజ్ఞతలు చెప్పారు.
తెలంగాణ అభివృద్ధిలో తన పాత్ర తప్పక ఉంటుందని చెబుతూ కొత్త భవనాలు నిర్మించడం మాత్రమే అభివృద్ధి కాదని.. తెలంగాణ గౌరవాన్ని నిలబెడదాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడదామంటూ పిలుపునిచ్చారు గవర్నర్. అనంతరం ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, సినీ గేయరచయిత చంద్రబోస్, బాలలత, ఆకుల శ్రీజతోపాటు పలువురిని గవర్నర్ తమిళిసై సన్మానించారు.