భారత రాష్ట్రపతి ముర్ము మొదటిసారి పార్లమెంట్ లో ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారని చెబుతూ ‘ఇది భారత రాజ్యాంగానికి ఇచ్చే గౌరవం. ఆదివాసీలకు, మహిళకు ఇచ్చే గౌరవం’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. పార్లమెంటులో నూతన సభ్యుడు ఎవరైనామాట్లాడాలనుకుంటే వారిని ప్రోత్సహిస్తుందని పేర్కొంటూ దేశ ఆర్ధికమంత్రి కూడా మహిళ అని ఆయన గుర్తు చేశారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొనడంతో ప్రస్తుత పరిస్థితుల్లో యావత్ ప్రపంచం భారత్ వైపు చూస్తుందని ప్రధాని పేర్కొన్నారు. అందరి ఆకాంక్షలు నెరవేర్చేలా నిర్మలా సీతారామన్ బడ్జెట్ రూపొందించారని భావిస్తున్నానని ఆయన చెప్పారు. ‘ఇండియా ఫస్ట్.. సిటిజన్ ఫస్ట్’ అనే కాన్సెఫ్ట్ ను ముందుకు తీసుకువెళ్తామని స్పష్టం చేశారు.
విపక్ష సభ్యులు అన్ని అంశాలపై పార్లమెంట్ లో లేవనెత్తెందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతూ అన్ని అంశాలపై సభలో చర్చ జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు.
కాగా, కాంగ్రెస్ ఎంపిలు సభకు గైర్హాజరయ్యారు. సోమవారం భారత్ జోడోయాత్ర ముగింపు సభలకు శ్రీనగర్ చేరుకున్నారు.అయితే జమ్ము కాశ్మీర్ లో అననుకూల పరిస్థితుల కారణంగా విమానాల రాకపోకలు రద్దవడంతో వారు శ్రీనగర్ లో నిలిచిపోయారు. మరోవైపు ఆప్, బిఆర్ ఎస్ లు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాయి.