అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు సంబంధించిన వివరాలను అందించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోని బ్యాంకులను కోరినట్లు సంబంధితవర్గాలు తెలిపాయి. ఆర్బిఐ నూతన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఒపి)లో భాగంగా కొత్త పరిణామాలు ఉండవచ్చని ఆ వర్గాలు తెలిపాయి. అయితే ఆర్బిఐ నుండి అధికారిక ప్రకటన విడుదల కావాల్సి వుంది.
అదానీ గ్రూప్ తన ఖాతాల్లో, షేర్లలో భారీగా అవకతవకలకు పాల్పడుతోందంటూ అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్ గత నెలలో ఓ నివేదికను విడుదల చేసిన సంగతి తెలిసిందే. నివేదికకు సంబంధించి అదానీ గ్రూప్, హిండెన్ బర్గ్‌కు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
అదానీ – హిండెన్ బర్గ్ నివేదిక అంశం గురువారం పార్లమెంటును కుదిపేసింది. ఈ కుంభకోణంపై విచారణ జరిపించాలంటూ ప్రతిపక్షాలు నినాదాలు చేయడంతో ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. అదానీ సంస్థ మోసంపై పార్లమెంట్ కమిటీ లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ చేపట్టాలని, రోజువారీ నివేదికను సమర్పించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
గురువారం ఒక్కరోజే గౌతమ్ అదానీ యాజమాన్యంలోని అదానీ గ్రూపు రూ. 2వేల కోట్ల నష్టాన్ని చవిచూసింది. గౌతమ్ అదానీ ఆస్తుల నికర విలువ పడిపోవడంతో కొద్ది రోజుల క్రితం వరకు ప్రపంచ కుబేరుల జాబితాలో మూడవ స్థానంలో ఉన్న ఆయన గురువారం 16వ స్థానానికి దిగజారారు. గత ఐదు రోజులల్లో అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ టోటల్ గ్యాస్ షేర్ల ధరలు 40 శాతానికి పైగా నష్టపోయాయి.
ఇలా ఉండగా, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ రూ. 20,000 కోట్ల ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్పిఓ) ను ఉపసంహరించుకోనున్నట్లు ప్రకటించారు. మదుపర్ల డబ్బులను వెనక్కి ఇస్తామని కూడా అదానీ ఎంటర్పైజెస్ ప్రకటించింది. వాస్తవానికి ఆ ఎఫ్పిఓ పూర్తిగా సబ్స్క్రయిబ్ అయింది. అయితే దానిని ఉపసంహరించుకోవాలని తీసుకున్న నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.
‘నా దృష్టిలో నా మదుపరుల ప్రయోజనాలే అతి ముఖ్యం. మదుపరులు మరింతగా నష్టపోకుండా ఉండేందుకే నేను ఎఫ్‌పిఓను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నాను’ అని అదానీ పేర్కొన్నారు. కాగా, అదానీతో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని బంగ్లాదేశ్ విద్యుత్ సంస్థ సవరించాలని కోరింది. ఈ మేరకు జార్ఖండ్‌లోని అదానీ పవర్‌ప్లాంట్‌కు బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ బోర్డ్ (బిపిడిబి) లేఖ రాసింది.
గౌతమ్ అదానీ గ్రూప్ షేర్లను కుదువ పెట్టుకుని మార్జిన్ మనీ ఇవ్వడానికి సిటీగ్రూప్ ఇన్కార్పొరేషన్ నిరాకరించింది. షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణల నేపథ్యంలో బ్యాంకులు ఇప్పుడు ఆయన కంపెనీ షేర్లను కొల్లాటెరల్‌గా పెట్టుకుని మార్జిన్ మనీ ఇవ్వడానికి సంకోచిస్తున్నాయి. హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌కు తోడు క్రెడిట్ సూయిస్ గ్రూప్ ఏజి కూడా అప్పులు ఇవ్వడంలో జాగ్రత్త పాటిస్తోంది.