ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వల్ల ప్రతిపక్షాలన్నీ ఏకం అవుతున్నాయని, ఎన్నికల వల్ల ఇది సాధ్యం కాలేదని అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానం చెబుతూ చేసిన సుదీర్ఘ ప్రసంగంలో ప్రతిపక్షాలను ఎండగడుతూ, ఒక విధంగా ఈ ఏడాది జరిగే 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు, వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికలకు బిజెపి ప్రచార అస్త్రాలను సిద్ధం చేసినట్లయింది.
“ఎన్నికల ఫలితాలు అలాంటి వారిని (ప్రతిపక్షాలు) ఏకతాటిపైకి తీసుకొస్తాయని నేను ఇంతకాలం అనుకున్నా. కానీ వారు ఇప్పుడు ఏకమయ్యారు. ఇందుకు వారు ఈడీకి ధన్యవాదాలు చెప్పాలి. ఎన్నికలు చేయలేని పనిని ఈడీ చేసింది. ఈడీ వల్లే వారు ఏకమవుతున్నారు” అని మోదీ పేర్కొన్నారు. ఈడీ దాడులపై ప్రతిపక్షాలన్నీ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
తన గురించి అబద్ధాలు చెబితే దేశ ప్రజలు నమ్మబోరని ప్రధాని మోదీ ప్రతిపక్షాలకు చురకలు అంటించారు. “మోదీపై నమ్మకం న్యూస్ పేపర్ల హెడ్లైన్ల నుంచి.. టీవీల నుంచి పుట్టింది కాదు. సంవత్సరాల పాటు నా అంకిత భావం వల్ల ప్రజల్లో నమ్మకం ఏర్పడింది. నేను చేసే ప్రతీ పని దేశ ప్రజల కోసమే. ఈ దేశ ఉజ్వలమైన భవిష్యత్తు కోసమే” అని మోదీ స్పష్టం చేశారు.
దేశాన్ని కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పాలించిన 2004-14 దశాబ్ద కాలం వ్యర్థం అయిందని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. వారి పాలనలో ప్రతి అవకాశాన్ని కూడా సంక్షోభంగా మార్చడమే యూపీఏ ట్రేడ్ మార్క్ అని ప్రధాని విమర్శించారు. 2జి స్కామ్, బొగ్గు, కామన్వెల్త్ గేమ్స్ లో కూడా స్కామ్ జరిగిందని మోదీ ఆరోపించారు.
“2004-14 ఓ కోల్పోయిన దశాబ్దం. ప్రస్తుతం నడుస్తున్నది భారత దశాబ్దం. 2004-14 దశాబ్దంలో అత్యంత అవినీతి జరిగింది. భారీ కుంభకోణాలు జరిగాయి. యూపీఏ పాలనలో కన్యాకుమారి నుంచి జమ్ము కశ్మీర్ వరకు అన్ని ప్రాంతాలు ఉగ్రవాదం గుప్పిట్లో ఉన్నాయి. హింస జరిగింది. ఆ దశాబ్దంలో వచ్చిన అన్ని అవకాశాలను కాంగ్రెస్ పార్టీ.. సంక్షోభాలుగా మార్చేసింది” అని మోదీ విమర్శించారు.
తాము అధికారంలోకి వచ్చాక ప్రపంచమంతా భారత్ వైపే చూస్తోందని మోదీ గుర్తు చేశారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా భారతదేశం వృద్ధి చెందుతోందని, అయితే దీన్ని కొందరు జీర్ణించుకోలేకున్నారని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు.
“నిన్న లోక్సభలో కొందరు విమర్శలు చేశారు. ఆ సమయంలో వారి మద్దతుదారులు చాలా ఉత్సాహంగా కనిపించారు. వాతావరణంగా ఎంతో ఉల్లాసంగా అనిపించింది. నేను టీవీలో చూశా” అంటూ రాహుల్ గాంధీ పేరు ప్రస్తావించకుండా ఆయన విమర్శలపై మోదీ ఛలోక్తి విసిరారు.
ఏమీ లేక మొక్కుబడి ఆరోపణలు చేస్తున్నారని మోదీ ఎదురు దాడి చేశారు. మోదీ వల్లే గౌతమ్ అదానీ ఎదిగారని రాహుల్ గాంధీ మంగళవారం విమర్శించగా, దానికి మోదీ స్పందించారు.దేశంలోని 25 కోట్ల కుటుంబాల్లో తాను సభ్యుడినేనని పేర్కొంటూ దేశంలోని 140 కోట్ల మంది ప్రజలే తనకు రక్షణ అని మోదీ ధీమా వ్యక్తం చేశారు.