ఇంద్రప్రస్థ విశ్వహిందూ పరిషత్ (ఐవీహెచ్‌పీ), విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఢిల్లీ రాష్ట్ర విభాగం దేశ రాజధాని ఢిల్లీలోని వ్యూహాత్మక స్థానాల్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 123 ప్రధాన భూ ఆస్తులను కాపాడింది. దాదాపు 40 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ (డిడబ్ల్యుబి) అక్రమ ఆక్రమణకు గురికాకుండా దాదాపు రూ. 20,000 కోట్ల విలువైన 123 ఆస్తులను కాపాడగలిగామని కేంద్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ వెల్లడించారు.
కేసు గురించి వివరంగా ఆయన మాట్లాడుతూ, 1910లో భారత ప్రభుత్వం భారతదేశం కొత్త రాజధాని కోసం ఢిల్లీలో విస్తారమైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. స్వాధీన ప్రక్రియను పూర్తి చేసి ప్రభుత్వ ఆధీనంలో ఉంచారు. 70వ దశకం చివరిలో ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ స్వాధీనం చేసుకున్న ఆస్తులలో 123కి నోటీసులిచ్చింది. వాటిలో చాలా వ్యూహాత్మకంగా వక్ఫ్ ఆస్తులుగా ఉన్నాయి. మొత్తం 123 కేసుల్లో ప్రభుత్వం దావాను వ్యతిరేకించింది.
విచిత్రమేమిటంటే, అప్పటి కేంద్ర వక్ఫ్, హౌసింగ్ మంత్రి ఫకృద్దీన్ అలీ అహ్మద్ సారథ్యంలో ప్రభుత్వం ఈ 123 ఆస్తులను ఢిల్లీ వక్ఫ్ బోర్డుకు శాశ్వత లీజుకు అద్దెకు బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించింది. ఎకరానికి సంవత్సరానికి ఒక రూపాయి మాత్రమే లీజ్ గా పేర్కొంటూ 27.03.1984న ఉత్తరువు జారీచేశారు.
ఈ చర్యను వ్యతిరేకిస్తూ, ఆ ఆస్తులను కాపాడటం కోసం ఇంద్రప్రస్థ విశ్వహిందూ పరిషత్ 1984లో డబ్ల్యు పి (సివిల్) 1512 ద్వారా ఢిల్లీ హైకోర్టులో ఆ నోటిఫికేషన్‌ను సవాలు చేసింది. హైకోర్టు మొదటి విచారణలోనే ప్రతిపాదిత బదిలీలపై ఎక్స్‌పార్ట్ ఇంజక్షన్‌ని మంజూరు చేసింది. ఈ రిట్ పిటిషన్‌ను 12.1.2011న హైకోర్టు కొట్టివేసింది.
ఈ విషయాన్ని తాజాగా పరిశీలించి, 6 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పటి వరకు 1.6.1984న హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వు అమలులో ఉంటుందని హైకోర్టు ఆదేశించింది.ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
అయితే, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఈ విషయాన్ని కొత్తగా పరిశీలించే బదులు 100 ఏళ్ల క్రితమే పూర్తయిన స్వాధీన ప్రక్రియను ఉపసంహరించుకోవడం ఆశ్చర్యం కలిగించింది. ఇది 05.03.2014 నోటిఫికేషన్ ద్వారా జరిగింది. లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌కు జారీ చేయడానికి కొన్ని గంటల ముందు మాత్రమే నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం.
మోడల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు వీహెచ్‌పీ ఫిర్యాదు చేసింది. పైగా, ఈ నోటిఫికేషన్‌ను ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. ప్రభుత్వం తన చర్యను సమర్థించుకోలేక ఇంద్రప్రస్థ విశ్వహిందూ పరిషత్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను ప్రాతినిధ్యంగా పరిగణించి, వీలైనంత త్వరగా తగిన నిర్ణయం తీసుకుంటామని ప్రకటన చేసింది.
ఈ అంశాన్ని పరిశీలించేందుకు జస్టిస్ ఎస్.కె. గార్గ్ (రిటైర్డ్.) నేతృత్వంలో ఇద్దరు సభ్యుల కమిటీని ప్రభుత్వం నియమించింది. ఢిల్లీ వక్ఫ్ బోర్డుకు కమిటీకి పలుమార్లు నోటీసులు పంపినా బోర్డు స్పందించలేదు. పైగా, ఎలాంటి దావా వేయలేదు. దానితో దావా రుజువు కాలేదని కమిటీ నిర్ధారించవలసి వచ్చింది. భారత ప్రభుత్వం ఇద్దరు సభ్యుల కమిటీ నిర్ణయాన్ని ఆమోదించింది. ఆ విధంగా పేర్కొన్న 123 ఆస్తులు ప్రభుత్వంలో కొనసాగుతున్నాయి.