జగిత్యాల మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్ బోగ శ్రావణి బుధువారం బీజేపీలో చేరారు. కొద్దీ రోజుల క్రితం మీడియా ముందుకు వచ్చి తనను బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వేధిస్తున్నాడని, మూడేళ్ల పదవీకాలంలో తనను తీవ్ర ఇబ్బందుల పెట్టారని, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసి ఆమె వార్తల్లో నిలిచింది.
ఆమె గత వారం చైర్ పర్సన్ పదవికి, బిఆర్ఎస్ కు రాజీనామా చేశారు. తాజాగా ఈరోజు బుధువారం కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ సమక్షంలో ఢిల్లీలో ఆమె బిజెపి కండువా కప్పుకున్నారు. శ్రావణితో పాటు పలువురు నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి బీజేపీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీలో చేరిన అనంతరం శ్రావణి మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీలో తనను అణచివేశారని, తన ఎదుగుదలను ఓర్చుకోలేక పోయారని ఆరోపించారు. కన్నీరు పెట్టుకుని బయటకు వచ్చినా తనను బీఆర్ఎస్ అధిష్టానం ఓదార్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మాభిమానంతోనే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చానని చెప్పారు. బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తానని చెప్పుకొచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, జగిత్యాల బీజేపీ జిల్లా అధ్యక్షులు మోర పెళ్లి సత్యనారాయణ రావు, జగిత్యాల మున్సిపల్ మాజీ కౌన్సిలర్ రంగు గోపాల్, తదితరులున్నారు.