ప్రస్తుతం బ్రిటన్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంథి పార్లమెంట్లో ప్రతిపక్షాల గొంతు నొక్కెస్తున్నారని, మైకులు ఆఫ్ చేస్తున్నారని అంటూ బిజెపి లక్ష్యంగా చేస్తున్న ఆరోపణలపై ఆ పార్టీ మండిపడుతున్నది. ఇతర దేశాల్లో రాహుల్ ఈ విధంగా మాట్లాడడం సరికాదని బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగారు.
రాహుల్ వ్యాఖ్యలు విదేశీ గడ్డపై భారత్‌ను అవమానించడమేనంటూ బిజెపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే సమయంలో అసలు పార్లమెంట్ సమావేశాలకు క్రమంగా హాజరుకాని రాహుల్ గాంధీ పార్లమెంట్ చర్చలపై మాట్లాడడాన్ని ఎద్దేవా చేస్తున్నారు.
రాహుల్ గాంధీ చేసిన వాఖ్యలపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారు కంచన్ గుప్తా తీవ్రంగా స్పందించారు. ట్వీట్టర్లో రాహుల్ హాజరును పోస్ట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. భారత్ పార్లమెంట్లో ప్రతిపక్షాలు మౌనంగా ఉన్నాయన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలు నిరాధారమైనవిగా కంచన్ గుప్తా కొట్టిపారేశారు.
పార్లమెంట్లో తమ మైక్‌లు పని చేస్తాయి.. కానీ వాటిని ఆన్ చేయలేమని.. తాను మాట్లాడుతున్నప్పుడు ఇది చాలాసార్లు జరిగిందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. వయనాడ్ ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ జీరో అటెండెన్స్ ఉన్నప్పుడు సైతం భారత్ పార్లమెంట్ సమావేశాలు మొత్తం జరిగాయని కంచన్ గుప్తా గుర్తు చేశారు.
తన పేలవమైన పనితీరును కవర్ చేయడానికే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని రాహుల్ గాంధీ పార్లమెంట్ అటెండెన్స్ డేటాను ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ హాజరు కేరళ సగటు కంటే చాలా తక్కువగా ఉందని కంచన్ గుప్తా వరుస ట్వీట్లలో ఆరోపించారు. జాతీయ సగటు కంటే కూడా ఆయన హాజరు శాతం చాలా తక్కువ అని విమర్శించారు.
2020లో పార్లమెంట్ వర్షకాల సమావేశాలలో రాహుల్ గాంధీ హాజరు శాతం జీరోగా ఉందన్నారు.మొత్తం మీద రాహుల్ పార్లమెంట్ హాజరు 52 శాతమేనని, అదే సమయంలో మొత్తం ఎంపీల హాజరు శాతం 79గా ఉందని పేర్కొన్నారు.
భారత పార్లమెంటులో 2019 నుంచి 2023 మధ్య రాహుల్ గాంధీ 92 ప్రశ్నలు అడిగారని, ఇందుకు సంబంధించి కేరళ ఎంపీల సగటు 216గా, జాతీయ సగటు 163గా ఉందని విమర్శించారు. సగటున భారత్ ఎంపీలు 68 చర్చల్లో పాల్గొంటే.. రాహుల్ గాంధీ స్కోర్ దారుణంగా 6 మాత్రమే ఉందని వరుస ట్వీట్లలో వెల్లడించారు.
కాగా, రాహుల్ వ్యాఖ్యలు ఆయన మావోయిస్టు ఆలోచనా విధానంతోపాటు అరాచక శక్తుల గుప్పిట్లో బందీ అయినట్లు స్పష్టంగా కనపడుతోందని మాజీ కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. తన అసత్యాలను, నిరాధార ఆరోపణలను వ్యాప్తిచేయడానికి బ్రిటిష్ పార్లమెంట్‌ను రాహుల్ గాంధీ వేదికగా చేసుకోవడాన్ని ఆయన ఖండించారు.
విదేశీ గడ్డపైన భారత ప్రజాస్వామ్యం, రాజకీయ వ్యవస్థ, పార్లమెంట్, న్యాయ వ్యవస్థ, భద్రతాపరమైన అంశాల గురించి రాహుల్ మాట్లాడడం సిగ్గుచేటని ప్రసాద్ ఆరోపించారు. అన్ని ప్రజాస్వామిక విధానాలను, రాజకీయ విజ్ఞతను రాహుల్ మరచిపోయారని ఆయన విమర్శించారు. భారత్‌లో ప్రజాస్వామ్య రక్షణకు యూరప్, అమెరికా జోక్యాన్ని రాహుల్ కోరడం సిగ్గుచేటని ప్రసాద్ ధ్వజమెత్తారు.
భారత అంతర్గత వ్యవహారాలలో విదేశీ జోక్యాన్ని సహించరాదన్న భారతీయుల ఏకాభిప్రయాన్ని కూడా రాహుల్ తోసిపుచ్చారని ఆయన మండిపడ్డారు. అత్యంత బాధ్యతారాహిత్యంతో రాహుల్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఖండిస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు.