తన తండ్రి వల్ల లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానంటూ ఇటీవల సినీ నటి, జాతీయ మహిళా కమీషన్ సభ్యురాలు ఖుష్బూ ఇటీవల చేసిన వాఖ్యలు సంచలనం కలిగించాయి. అయితే, తనకు జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి చెప్పినందుకు ఏమాత్రం సిగ్గుపడటం లేదని ఆమె స్పష్టం చేశారు.
”నాకు జరిగిన అన్యాయాన్ని ధైర్యం చేసి నిజాయతీగా అందరికీ తెలిసేలా చేశాను. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. అలాగే ఆ విషయాన్ని చెప్పినందుకు నేనేమీ సిగ్గుపడటం లేదు. నాపై ఆ దారుణానికి పాల్పడిన వ్యక్తి సిగ్గుపడాలి.” అని ఆమె తెలిపారు.
“అలాగే మహిళలందరూ ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి. మిమ్మల్ని కించపరిచే వాటిని ప్రోత్సహించకూడదు. నాకు జరిగిన దారుణాన్ని అందరితో చెప్పడానికి సమయం తీసుకొని ఉండొచ్చు. అదే మాదిరిగా ప్రతి ఒక్కరూ తమకు ఎదురైన వేధింపులను వెల్లడించి.. తమ ప్రయాణాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నా” అని ఆమె వివరించారు.
మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా ఝార్ఖండ్లో జరిగిన ఓ కార్యక్రమానికి ఇటీవల ఖుష్బూ ముఖ్య అతిథిగా పాల్గొంటూ నారీ శక్తి గురించి మాట్లాడుతూ … తాను ఎనిమిదేళ్ల వయసులో లైంగిక వేధింపులకు గురైనట్లు చెప్పారు.
”భార్యాపిల్లల్ని చిత్రహింసలు పెట్టడం, కన్న కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడడాన్ని జన్మహక్కుగా భావించే వ్యక్తి వల్ల నా తల్లి వైవాహిక బంధంలో ఇబ్బందులు పడింది. ఎనిమిదేళ్ల వయసులోనే నేను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను. 15 ఏళ్ల వయసులో ఆయనకు ఎదురు తిరగడం మొదలుపెట్టాను. నాకు 16 ఏళ్లు రాకముందే ఆయన మమ్మల్ని వదిలి వెళ్లిపోయాడు” అని ఆమె వెల్లడించారు.