సీఎం కేసీఆర్ కుమార్తె, బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవితను ఢిల్లీ మద్యం కుంభకోణంలో శనివారం ఢిల్లీలో సుమారు తొమ్మిది గంటలపాటు విచారించడం తెలంగాణాలో రాజకీయ ఉత్కంఠకు దారితీసింది. ఆమెను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేయవచ్చనే కధనాలు వ్యాప్తి చెందడంతో బిఆర్ఎస్ శ్రేణులు ఆందోళనతో పెద్దపెట్టున నిరసనలు చేపట్టారు.
ఈ లోగా, బిజెపి రాష్త్ర అధ్యక్షుడు బండి సంజయ్ కవిత గురించి అనుచితంగా మాట్లాడారంటూ నిరసనలకు దిగారు. ఢిల్లీతో పాటు తెలంగాణాలో పలుచోట్ల సంజయ్ దిష్టిబొమ్మలను దగ్ధం లేశారు. పలు పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదులు చేశారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఈ అంశాన్ని సుమోటోగా చేపట్టి విచారణ జరిపామని డిజిపిని ఆదేశించింది. మరోవంక, ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్ కు కూడా ఫిర్యాదు చేశారు.
కాగా, కవితను ఈడీ అధికారులు ఈనెల 13న మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పడంతో ఆరోజు కవిత జన్మదినం కావడం వల్ల 16వ తేదిన వస్తానని ఈడీకి చెప్పడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరెట్ అధికారులు అంగీకరించారు. ఈడీ విచారణ సందర్భంగా కేటీఆర్, హరీష్ రావు లతో పాటు ఆరుగురు రాష్ట్ర మంత్రులు, పలువురు బిఆర్ఎస్ నేతలు, న్యాయనిపుణుల బృందం ఢిల్లీలో మకాం వేసింది.
ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన హైదరాబాద్కు చెందిన కవిత మాజీ ఛార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబు, ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్రన్ పిళ్లై ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా కవితను ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అరుణ్ రామచంద్రన్ పిళ్లైని కవితను ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించినట్లు తెలుస్తోంది.
ప్రధానంగా కవిత ధ్వంసం చేసిన ఫోన్ల గురించి అడిగినట్టు తెలుస్తోంది. గతంలో ఆమె వాడిన ఫోన్లలోని డేటాను కూడా ఈడీ అధికారులు సేకరించి దానిపై ప్రశ్నలు కురిపించినట్టు సమాచారం. మరోవైపు ఆమె ప్రస్తుతం వాడుతున్న ఫోన్ ను సహితం ఇంటినుండి రప్పించి సీజ్ చేశారు.
హవాలా నిరోధక చట్టంలోని సెక్షన్ 50 కింద కవిత వాంగ్మూలాన్ని దర్యాప్తు అధికారులు నమోదు చేశారు. కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు ప్రశ్నించిన సమయంలో ఈడీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా 144 సెక్షన్ విధించారు. ఇకపోతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గతంలో సిబిఐ అధికారులు కవితను సాక్షిగా విచారించిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పటివరకు దాఖలు చేసిన చార్జ్షీట్లలో కవిత పేరును పలు సందర్భాల్లో దర్యాప్తు సంస్థలు ప్రస్తావించాయి.
తాజాగా ఈ కేసులో అరెస్ట్ చేసిన అరుణ్ రామచంద్ర పిళ్లైని న్యాయస్థానంలో హాజరుపరిచిన సందర్భంగా కూడా రిమాండ్ రిపోర్టులో కీలక అభియోగాలు మోపింది. కవిత బినామీనని పిళ్లై ఒప్పుకున్నట్లు ఇడి తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఈ కేసులో అరెస్టయిన సమీర్ మహేంద్రుని ఇండోస్పిరిట్ గ్రూప్లో పిళ్లై కూడా భాగస్వామిగా ఉన్నారని.. ఎల్ 1 లైసెన్స్ ఉన్న ఇండో స్పిరిట్లో పిళ్లైకి 32.5 శాతం వాటా ఉండగా, ప్రేమ్ రాహుల్కు కూడా 32.5 శాతం వాటా ఉందని ఇడి తెలిపింది.
ప్రేమ్ రాహుల్, అరుణ్ రామచంద్ర పిళ్లైలు.. కవిత, వైఎస్ఆర్సిపి ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిలకు బినామీలుగా ప్రాతినిధ్యం వహించారని ఇడి తన నివేదికలో పేర్కొంది. భాగస్వామ్య సంస్థలో కవిత వ్యాపార ప్రయోజనాలకు పిళ్లై ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఇడి పేర్కొంది. దీని ఆధారంగా కవితకు ఇడి సమన్లు జారీ చేసింది.
అయితే అరుణ్ రామచంద్ర పిళ్లై శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టులో ఇడికి ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకోవడానికి పిటిషన్ దాఖలు చేశారు. ఇడికి ఇచ్చిన వాంగ్మూలం వెనక్కి తీసుకునేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. దీంతో కోర్టు ఇడికి నోటీసులు జారీ చేసింది. పిళ్లై మార్చి 13 వరకు ఇడి కస్టడీలో ఉండనున్న సంగతి తెలిసిందే.