కేంద్ర మంత్రి అమిత్ షా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఆదివారం అమిత్ షా హైదరాబాదులో సీఐఎస్ఎఫ్ 54వ రైజింగ్ డే ఉత్సవాలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. హకీంపేటలో సీఐఎస్ఎఫ్ దళాల గౌరవ వందనం స్వీకరించి, ఉత్తమ సేవలు అందించిన సీఐఎస్ఎఫ్ అధికారులకు అమిత్ షా రివార్డులు అందజేశారు.
అనంతరం అమిత్ షా హైదరాబాద్ నుండి కొచ్చి వెళ్లాల్సి ఉండగా, ఆయన ప్రయాణించాల్సిన విమానం సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. దాంతో ఆయన హకీంపేట విమానాశ్రయంలోనే ఉండిపోయారు. విమాన మరమ్మతులకు సమయం పట్టడంతో అమిత్ షా విమానాశ్రయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ లతో సమావేశమయ్యారు.
రాష్ట్రంలో పార్టీని బలోపేతీం చేసే విషయమై అమిత్ షాతో పార్టీ నేతలు చర్చించారు. బీఆర్ఎస్ వ్యూహాన్ని ఎదుర్కొనేందుకు అవలంభించాల్సిన తీరుపై నేతలకు అమిత్ షా దిశా నిర్ధేశం చేశారని సమాచారం.
కాగా, సీఐఎస్ఎఫ్ వల్ల నక్సలైట్లు, టెర్రరిస్టులు అదుపులో ఉన్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. హైదరాబాద్ లో జరిగిన 54వ సీఐఎస్ఎఫ్ రైజింగ్ డే సందర్భంగా అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొంటూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సీఐఎస్ఎఫ్ కు నివాళి అర్పించారు.
53 ఏళ్లుగా దేశ సేవలో సీఐఎస్ఎఫ్ కీలకపాత్ర పోషిస్తుందని కొనియాడారు. సీఐఎస్ఎఫ్ ని హోంశాఖ బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. ప్రాణాలకు తెగించి సీఐఎస్ఎఫ్ సిబ్బంది విధి నిర్వహణలో పాలుపంచుకోవడం దేశానికి గర్వకారణమని తెలిపారు. ఉగ్రవాదాన్ని అణచివేస్తున్నామని స్పష్టం చేసారు.
మూడు వేల సిబ్బందితో ప్రారంభమైన సీఐఎస్ఎఫ్ ఇప్పుడు లక్షా 70వేల మందితో సేవలు అందిస్తుందని అమిత్ షా వెల్లడించారు. దేశవ్యాప్తంగా రోజు 50 లక్షల మంది ప్రయాణికులకు సీఐఎస్ఎఫ్ భద్రత కల్పిస్తుందని చెప్పారు. డ్రోన్ టెక్నాలజీ ని సీఐఎస్ఎఫ్ ను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. తీవ్రవాదాన్ని నిర్మూలించే విషయంలో కేంద్ర భద్రత బలగాలు అద్భుతంగా పనిచేస్తున్నాయని తెలిపారు.