ప్రపంచంలో అత్యధిక విద్యావంతులు కలిగిన దేశాల జాబితాలో భారత్, అమెరికాలకు స్థానం దక్కలేదు. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ (డబ్ల్యుఓఎస్) తాజాగా ప్రపంచంలో అత్యధిక విద్యావంతులు కలిగిన దేశాల జాబితాను విడుదల చేసింది.
డబ్య్లుఓఎస్ విడుదల చేసిన టాప్ -20 దేశాల జాబితాలో స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో నిలవగా, రెండో స్థానంలో జపాన్, మూడోస్థానంలో స్వీడెన్ నిలిచాయి. కానీ టాప్ 20 దేశాల జాబితాలో అమెరికా, భారత్కు చోటు దక్కలేదని డబ్ల్యుఓఎస్ తాజా నివేదిక వెల్లడించింది. అయితే డబ్య్లుఓఎస్ ఆయా దేశాలకు ఏ ప్రాతిపదిక ఆధారంగా ర్యాంకింగ్ ఇచ్చిందోననే దానిపై ప్రమాణాల్ని పేర్కొనలేదు.
కాగా టాప్ 10 దేశాల జాబితాలో జర్మనీ (4), లండన్ (5), డెన్మార్క్ (6), నార్వే (7), ఫిన్లాండ్ (8), కెనడా (9), నెదర్లాండ్స్ (10)వ స్థానాల్లో ఉన్నాయి. ఇక ఇందులో అమెరికా (21), స్పెయిన్ (23), ఇజ్రాయెల్ (24), చైనా 26వ స్థానంలో నిలిచినట్లు ఈ నివేదిక తెలిపింది.
అమెరికాలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలైన మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (1), స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం (3), హార్వర్డ్ విశ్వవిద్యాలయం (5), యూనివర్సిటీ ఆఫ్ చికాగో (10) వంటి నాలుగు యూనివర్సిటీలు 2023 వరల్డ్ యూనివర్సిటీ ర్యాకింగ్స్ (క్యూఎస్)లో స్థానం దక్కించుకున్నాయి.
అమెరికాలోని నాలుగు యూనివర్సిటీలు క్యూఎస్లో స్థానం సంపాదించున్నప్పటికీ అమెరికా మాత్రం విద్యావంతుల జనాభా కలిగిన దేశాల జాబితాలో స్థానం దక్కించుకోకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఇక భారత్లో అక్షరాస్యత 74.04 శాతం, అమెరికాలో 79 శాతం అక్షరాస్యత ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి.
అలాగే భారత్లో విద్యారంగ అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం 2022-23 బడ్జెట్లో స్వల్పంగా కేటాయింపులు పెంచింది. ఈ ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ విద్యారంగ కేటాయింపు రూ. 1.04 లక్షల కోట్ల నుంచి రూ. 1.12 లక్షల కోట్లకు అంటే 8 శాతం మేర పెంచారు. విద్యార్థులకు, యువతకు ఉపయోపడేలా డిజిటల్ లైబ్రరీని అందుబాటులోకి తేనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.