లోక్‌సభలో స్పీకర్ ఓమ్ బిర్లా ప్రతిష్ఠంభనను ముంగించేసేందుకు పిలిచిన సమావేశం ఎలాంటి ఫలితం లేకుండా ముగిసింది. పార్టీలు తమ వ్యతిరేకతను వదులుకోడానికి ఇష్టపడలేదు. అభిజ్ఞ వర్గాల ప్రకారం అధికార పక్షం బిజెపి, ప్రతిపక్షమైన కాంగ్రెస్ తమ వైఖరిని వదులుకోడానికి ఒప్పుకోలేదు.
కాగా లోక్‌సభ సమావేశానికి అన్ని పార్టీల నాయకులు హాజరయ్యారు. సభా కార్యక్రమాలు కొనసాగేలా చూడాలని అన్ని పార్టీలకు స్పీకర్ బిర్లా విజ్ఞప్తి చేశారు. అయితే బిజెపి కానీ, కాంగ్రెస్ కానీ తమ వైఖరిని సడలించడానికి ససేమీరా అన్నాయి.
ఎంపీ రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యంపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ బిజెపి లోక్‌సభ కార్యకలాపాలను కొనసాగనివ్వడంలేదు. మరోవంక, కాంగ్రెస్ నేతృత్వంలో ప్రతిపక్షాలు అదానీ అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జెపిసి) దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నాయి.
రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై దాదాపు 10 రోజులు కావస్తున్నా ఉభయసభల్లో వాయిదాల పర్వం మాత్రం ఆగడంలేదు. అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని విపక్షాలు పట్టుపడుతుండగా.. లండన్‌లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చేసిన ప్రసంగంపై రాహుల్‌గాంధీ క్షమాపణలు చెప్పాలని అధికారపక్ష సభ్యులు ఎదురుదాడి చేస్తున్నారు.అధికార పక్షం,ఇటు ప్రతిపక్షాలు ఏడు రోజులైనా పట్టు సడలించడం లేదు. ఆటంకాల మధ్య కేంద్ర బడ్జెట్ (ఆర్థిక బిల్లు)పై చర్చ జరగనే లేదు.
గురువారం ఉదయం 11 గంటలకు ఉభయసభలు ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు అదానీ అంశంపై జేపీసీ కోసం పట్టుబట్టారు. ఆ వెంటనే అధికారపక్షం ఎంపీలు కూడా రోజులాగే రాహుల్‌గాంధీ స్పీచ్ అంశాన్ని లేవనెత్తారు. రాహుల్‌గాంధీ క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్‌తో ఎదురుదాడికి దిగారు. దాంతో అటు రాజ్యసభలో, ఇటు లోక్‌సభలో గందరగోళం చెలరేగింది. ఇరువర్గాల సభ్యులు పోటాపోటీ నినాదాలతో సభలను హోరెత్తించారు.
లోక్‌సభలో స్పీకర్ ఓంబిర్లా, రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధన్కర్ ఆందోళన చేస్తున్న సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు. దాంతో ముందుగా ఉభయసభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదాపడ్డాయి. ఒంటిగంటకు లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ వేర్వేరుగా ఆల్‌పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది. మధ్యాహ్నం రెండు గంటలకు ఉభయసభలు తిరిగి ప్రారంభమైనా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. దాంతో ఉభయ సభలు గురువారానికి వాయిదా పడ్డాయి.