ఓ పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషిగా తేల్చింది. ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. సెక్షన్లు 499, 504 కింద కోర్టు రాహుల్ గాంధీకి ఈ శిక్ష విధించింది. ఆ వెంటనే ఆయనకు బెయిల్ కూడా మంజూరు చేసింది.కోర్టులో అప్పీలు చేసుకోవడానికి వీలుగా తీర్పు అమలును 30 రోజులపాటు నిలిపివేసింది.
‘మోదీ ఇంటి పేరు ఉన్నవారంతా దొంగలే ’ అంటూ 2019లో రాహుల్ గాంధీ కర్ణాటకలో జరిగిన ఓ సభ్యలో వ్యాఖ్యనించారు. దీనిపై గుజరాత్‌కు చెందిన బిజెపి ఎంఎల్ఏ పూర్ణేశ్ మోడీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పరువు నష్టం దావా వేశారు. రాహుల్ వ్యాఖ్యలు మొత్తం `మోదీ’ సముదాయాన్నే అపఖ్యాతిపాలు చేసేదిగా ఉందని పేర్కొన్నారు.
దీనిపై విచారణ జరిపిన కోర్టు తాజాగా రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. గమనించాల్సిన విషయం ఏమిటంటే నీరవ్ మోడీ, లలిత్ మోడీ, నరేంద్ర మోడీ…వీరందరి ఇంటి పేరు మోడీ అని ఉండడమే. వీరంతా ఏదో ఒక ఆరోపణను ఎదుర్కొంటున్నవారే.
కాగా, 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8(3) ప్రకారం ఆయనపై అనర్హత పడేఅవకాశం ఉంది. అంతేకాదు సూరత్ కోర్ట్ తీర్పు ప్రకారం లోక్‌సభ సెక్రటేరియట్ ఆయనపై వెంటనే చర్యలు కూడా తీసుకోవచ్చు. రాహుల్‌ను అనర్హుడిగా ప్రకటించి వాయనాడ్‌లో మళ్లీ ఎన్నికలు జరిపించవచ్చు. పై కోర్టులు కనుక సూరత్ కోర్ట్ తీర్పును కొట్టేయకపోతే రాహుల్ ఎనిమిదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయలేరు.
అయితే సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై రాహుల్ పైకోర్టులో అప్పీలుకు వెళతారని కాంగ్రెస్ పార్టీ గురువారం తెలిపింది. సత్యం మాట్లాడినందుకే రాహుల్‌ను శిక్షించారంటూ కాంగ్రెస్ ఆరోపించింది.