అధికారపక్షం ఎంత ఎక్కువ విజయాలు సాధిస్తే అంతగా ప్రతిపక్షాలకు టార్గెట్ అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ ఎంపిలకు తెలిపారు. ఇటీవల జరిగిన మూడు ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత త్రిపురలో పార్టీ అధికారాన్ని నిలుపుకోగలిగిన తర్వాత జరిగిన తొలి బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రసంగిస్తూ ప్రతిపక్షాల నిరంతర నిరసనలను ప్రస్తావించారు.
బీజేపీ మరిన్ని ఎన్నికలలో విజయం సాధిస్తున్న కొద్దీ ఇలాంటి ఆందోళనలు మరింత తీవ్రమవుతాయని గుజరాత్ ఎన్నికల సమయంలో తాను చెప్పానని మోదీ గుర్తు చేశారు. పార్టీ మరింత తీవ్రమైన, దిగువ స్థాయి దాడులను ఎదుర్కొంటుందని ఆయన ఈ సందర్భంగా అప్రమత్తం చేశారు. ఇటీవల ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించిందంటూ ఈ సమావేశంలో ప్రధాని మోదీని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి. నడ్డా సత్కరించారు.
ఏప్రిల్ 6న పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతికి మధ్య కాలాన్ని సామాజిక న్యాయం కోసం కేటాయించాలని ఎంపీలను ప్రధాని కోరారు. ప్రభుత్వ తొమ్మిదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మే 15 నుంచి నెల రోజుల పాటు ఆయా నియోజకవర్గాల్లో వివిధ ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయాలని మోదీ పార్టీ ఎంపీలను కోరారు.
భూమాత కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తనను విషపూరితం చేసే రసాయనాల నుంచి విముక్తి కల్పించాలని భూమాత ఏడుస్తోందని ఆయన పేర్కొన్నారు. రాజకీయ నాయకులు రాజకీయేతర ప్రయోజనాల కోసం పనిచేయాలని చెబుతూ అలాగే వారు సమాజంపై చాలా ప్రభావాన్ని చూపుతారని తెలిపారు.
తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ‘బేటీ బచావో’ (ఆడబిడ్డలను కాపాడండి) కోసం గుజరాత్ ప్రభుత్వం చేసిన కృషిని ఈ సందర్భంగా మోదీ ప్రస్తావించారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవడానికి నిపుణుల సేవలను ఉపయోగించుకోవాలని ఎంపీలను కోరారు.
అవినీతిపై పోరాటం
కాగా, ఏడు దశాబ్దాల్లో తొలిసారిగా ఎన్నడూ లేనంతగా అవినీతిపై పోరాడుతుంటే కొందరికి (ప్రతిపక్షాలకు) కోపం వస్తోందని, అందుకే వారు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ప్రధాని ఎద్దేవా చేశారు. న్యూఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో కొత్త భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ భారత్లో పటిష్టమైన రాజ్యాంగ వ్యవస్థలున్నాయని, బీజేపీని ఎదుర్కోలేక రాజ్యాంగ సంస్థలపై దాడులు చేస్తున్నారని విమర్శించారు.
కఠినంగా వ్యవహరిస్తోన్న రాజ్యాంగ సంస్థలను ప్రశ్నిస్తూ కోర్టులకు వెళ్తున్నారని మోదీ ఎద్దేవా చేశారు. కొన్ని పార్టీలైతే (ప్రతిపక్షాలు) అవినీతిని సంరక్షించాలంటూ ఉద్యమం కూడా ప్రారంభించాయని అంటూ అవినీతిపరులంతా ఒకే వేదికపైకి వచ్చారని మోదీ చురకలంటించారు. అవినీతిపరులపై చర్యలతో దేశ ప్రజలు సంతోషంగా ఉన్నారని మోదీ చెప్పారు.