హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో టెన్త్ హిందీ ప్రశ్నపత్రాన్ని బయటకు తీసుకొచ్చిన కేసులో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను బుధవారం తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో బండి సంజయ్‌ను ఏ1గా చేర్చారు.
ఏ2గా ప్రశాంత్, ఏ3గా మహేశ్, ఏ4గా మైనర్ బాలుడు, ఏ5గా మోతం శివగణేశ్, ఏ6గా పోగు సురేశ్, ఏ7గా పోగు శశాంక్, ఏ8గా దూలం శ్రీకాంత్, ఏ9గా పెరుమాండ్ల శార్మిక్, ఏ10గా పోతబోయిన వసంత్ పేర్లను చేర్చారు.
సంజయ్‌పై కమలాపూర్ పోలీసులు తెలంగాణ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్, 1997 లోని సెక్షన్ 5 కింద కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 120 బీ, సెక్షన్ 420 కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో బండి సంజయ్‌ను పోలీసులు హనుమకొండ కోర్టు కాంప్లెక్స్ పక్కనే జడ్జి అనిత రాపోలు ఎదుట ప్రవేశపెట్టారు.
అయితే బండి సంజయ్‌ను జడ్జి ఎదుట ప్రవేశపెట్టేందుకు తీసుకువస్తున్నారని బీజేపీ కార్యకర్తలకు సమాచారం తెలియడంతో అక్కడికి భారీగా చేరుకున్నారు. బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధులు కూడా చేరుకున్నారు. అయితే ఏ ఒక్కరిని కూడా లోపలికి అనుమతించకుండా అటు కోర్టు గేటు వద్ద, ఇటు జడ్జి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. బీఆర్ఎస్ శ్రేణులు కూడా అక్కడకు భారీగా చేరుకున్నారు. ఇరు వర్గాలు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి.
కరీంనగర్లో బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మొదట యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మలరామారం పీఎస్‌కు తరలించారు. అక్కడ్నుంచి జనగామ పట్టణం మీదుగా పాలకుర్తికి తరలించారు. పాలకుర్తి సీహెచ్‌సీలో బండి సంజయ్‌కు వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం హనుమకొండ మెజిస్ట్రేట్ ఎదుట సంజయ్‌ను పోలీసులు హాజరు పరిచారు. టెన్త్ హిందీ ప్రశ్నపత్రం లీక్ కేసులో బీజేపీ కార్యకర్త బూరం ప్రశాంత్‌ను మంగళవారం అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
భగ్గుమన్న బిజెపి శ్రేణులు
తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కారణం చెప్పకుండా తమ నేతను అరెస్ట్ చేశారంటూ కార్యకర్తలు మండిపడుతున్నారు. సంజయ్‌ను కరీంనగర్లో అరెస్ట్ చేసి భువనగిరి జిల్లా బొమ్మల రామారం పోలీస్‌స్టేషన్‌కు తరలించిన నేపథ్యంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు సహా బీజేపీకి శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి.
దీంతో పోలీస్‌స్టేషన్ పరిసరాల్లో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లే ప్రధాన మార్గాన్ని బారికేడ్లతో పోలీసులు మూసివేశారు. బిజెపి కార్యకర్తలను అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అనంతరం రఘనందన్ తో సహా పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
కాగా, పరామర్శించడానికి వచ్చిన వాళ్లను అరెస్ట్ చేయడం ఏంటని, తనను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని రఘునందన్ రావు పోలీసులను ప్రశ్నించారు. రఘునందన్ రావుతో పాటు మరికొందరు మహిళా బేజేపీ నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ ముందు మరింత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
బండి సంజయ్ అరెస్ట్‌పై బీజేపీ ముఖ్యనేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చెప్పారు. ఒక ఎంపీని కారణం చెప్పకుండా అరెస్ట్ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ చెప్పినట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు, తప్పుదోవ పట్టించేందుకే సంజయ్‌ను అరెస్ట్ చేశారన్నారు. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కెసిఆర్ ప్రభుత్వం రజకార్ల ప్రభుత్వాన్నితలపిస్తున్నదని బిజెపి ఎంపి డాక్టర్ కె లక్ష్మణ్ మండిపడ్డారు.. కెసిఆర్ అక్రమాలపై నిలదీస్తున్నందునే బండి ని అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు. వెంటనే బండిని విడుదల చేయాలని ఆరోపించారు. సంజయ్ అక్రమ అరెస్ట్‌ను బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. బిఆర్ ఎస్ కు కాలం చెల్లిందని.. ప్రజలు త్వరలోనే ఆ పార్టీకి బుద్ధి చెబుతారని ఆమె హెచ్చరించారు.
సంజయ్ అరెస్ట్‌పై బీజేపీకి హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఆ పార్టీ నేతలు హౌస్‌మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. అర్ధరాత్రి ఆయన్ను అక్రమంగా అరెస్ట్ చేశారని పిటిషన్లో పేర్కొన్నారు.