గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండటం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరి పారా మిలిటరీ బలగాలను తెప్పించాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి కలకత్తా హైకోర్టు సూచించింది. మార్చి 30న శ్రీరామనవమి సందర్భంగా పశ్చిమబెంగాల్లోని హౌరా, హుగ్లీ నగరాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో బెంగాల్ ఉన్నత న్యాయస్థానం ఈ సూచన చేసింది.
హనుమాన్ జయంతి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించడం కోసం పారా మిలిటరీ బలగాలను పంపాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరాలని, అదేవిధంగా ఇటీవల హింసాత్మక ఘటనలు జరిగినందున 144 సెక్షన్ అమలులో ఉన్న ప్రాంతాల్లో హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించకూడదని కలకత్తా హైకోర్టు సూచించింది.
ఆ తర్వాత కాసేపటికే కేంద్ర హోంశాఖ కూడా శ్రీరామనవమి సందర్భంగా ఎలాంటి హింసకు తావులేకుండా చర్యలు తీసుకోవాలంటూ మార్గదర్శకాలు జారీ చేసింది. శ్రీరామనవమి సందర్భంగా పశ్చిమబెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ముందు జాగ్రత్తగా ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది.
హనుమాన్ జయంతిని దృష్టిలో ఉంచుకుని శాంతిభద్రతలను కాపాడాలని అన్ని రాష్ట్రాలకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అడ్వైజరీ జారీ చేసింది. శ్రీరామనవమి సందర్భంగా బీహార్, పశ్చిమ బెంగాల్‌తో సహా పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న క్రమంలో అలెర్ట్ గా ఉండాలని కేంద్రం సూచించింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ ట్విటర్లో వెల్లడించింది.
‘‘హనుమాన్ జయంతి ఏర్పాట్ల నిమిత్తం అన్ని రాష్ట్రాలకు హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. పండగ శాంతియుతంగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వాలు చూడాలి. ఆ సమయంలో శాంతి భద్రతలను పరిరక్షించాలి. సమాజంలో మత సామరస్యానికి భంగం కలిగించే ముప్పును నిరంతరం పర్యవేక్షించాలి’’ అని హోంశాఖ అన్ని రాష్ట్రాలను కోరింది.
మరోవైపు శ్రీరామనవమి సందర్భంగా జరిగిన అల్లర్లపై సమగ్ర నివేదిక ఇవ్వాలని మంగళవారం బెంగాల్ ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. ఇదిలావుంటే హనుమాన్ జయంతి సందర్భంగా హింసకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని బెంగాల్ సర్కారు కూడా రాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేసింది.
