ప్రభుత్వం నిర్మించిన కార్యక్రమాలు, సినిమాలను ప్రసారం చేసేలా అమెజాన్ ఇండియాతో కేంద్రం ఓ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ప్రభుత్వం నిర్మించిన పలు కార్యక్రమాలను అమెజాన్ వేదికగా ఓటిటిలోనూ ప్రసారం కానున్నాయి.
ఒప్పందంపై సంతకం చేసిన అనంతరం కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ భారత దేశ నాగరికత, సంస్కృతి, సాంప్రదాయల నుండి మిలియన్ల కొద్దీ కథలు ఉన్నాయని.. వాటిని ఓటిటి ద్వారా ప్రసారం చేసేలా ఒప్పందం కుదిరినట్లు తెలిపారు.
నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎఫ్డిసి), దూరదర్శన్‌లతో పాటు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా నుండి ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ సంబంధిత కార్యక్రమాలు ఓటిటిలో ప్రసారమవుతాయని పేర్కొన్నారు.
ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో కోర్సు నేర్చుకుంటున్న విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఇంటర్న్‌షిప్‌లు, మాస్టర్క్లాసులతో పాటు ఇతర అవకాశాలు కల్పించనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.
అలాగే పరిశ్రమ అకాడమీల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుందని తెలిపింది. అయితే భారత్‌లోని అమెజాన్‌తో సహా పలు ఓటిటి ప్లాట్‌ఫామ్‌లపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. బిజెపికి చెందిన హిందూ సంఘాలు అధికంగా ఫిర్యాదులు చేయడం గమనార్హం.