మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరుగనున్న రాజస్తాన్ కాంగ్రెస్‌లో సిగపట్లు శృతిమించుతున్నాయి. సొంతపార్టీపైనే మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ విమర్శల దాడికి దిగారు. గతంలో వసుంధర రాజే పాలనలో రాష్ట్రంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవడంలో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం విఫలమైందని సచిన్ పైలెట్ మండిపడ్డారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంగళవారం ఒక రోజు నిరాహార దీక్షకు చేపట్టనున్నట్లు ప్రకటించారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలకు కట్టుబడి ఉందని ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని సచిన్ పైలెట్ స్పష్టం చేశారు.
ఎక్సైజ్మాఫియా, అక్రమ మైనింగ్, భూ ఆక్రమణలు, లలిత్ మోడీ అఫిడవిట్ కేసుపై చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. వీటిపై విచారణను ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. వసుందరా రాజే హయాంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వసుంధర రాజే పాలన వైఫల్యాలు, అవినీతిపై గెహ్లాట్ ఆరోపణలు చేస్తున్నట్లు కనిపిస్తోన్న వీడియోలను ఈ సందర్భంగా సచిన్ ప్రదర్శించారు. వసుంధరా రాజే పాలనలోని అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద ఆధారాలు ఉన్నాయని, అయినప్పటికీ వాటిపై చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
ఈ హామీలను నెరవేర్చకుండా ఎన్నికలకు వెళ్లలేమని పైలట్ పేర్కొన్నారు. త్వరలో ఎన్నికలు రానున్నాయని, ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని, ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాల్సి ఉందని సచిన్ పైలట్ తెలిపారు. రాజస్తాన్ వ్యవహారాలపై పార్టీ అధిష్ఠానానికి అనేక సూచనలు చేశానని, అవినీతిపై చర్యలు తీసుకోవడం వాటిలో ఒకటని చెప్పారు.
ఇది మన ప్రభుత్వమని, మనం చర్యలు తీసుకోవాలని, దీంతో ప్రజల విశ్వాసం కొనసాగుతుందని పేర్కొన్నారు. 2018లో రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినపుడు గెహ్లాట్, పైలెట్లు చెరో రెండున్నరేళ్లపాటు ముఖ్యమంత్రులుగా కొనసాగుతారని అధిష్టానం పేర్కొంది. కానీ ఇప్పటివరకు సచిన్ పైలెట్‌కు ఆ అవకాశం దక్కకపోవడం గమనార్హం. గెహ్లాట్ పై పైలెట్ పలుమార్లు తిరుగుబాటు ప్రకటించారు కూడా.