కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీలో పలు ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. శివమొగ్గకు చెందిన బిజెపి ఎంఎల్ఎ, మాజీ ఉప ముఖ్యమంత్రి కె.ఎస్. ఈశ్వరప్ప (74) అసెంబ్లీ ఎన్నికలకు పోటీచేయబోవడంలేదని ప్రకటించారు. మరోవంక, మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్ ను పోటీకి దూరంగా ఉండమని పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది.
ఈశ్వరప్ప తాను అసెంబ్లీ ఎన్నికలకు పోటీచేయబోవడంలేదన్న విషయాన్ని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి.నడ్డాకు లేఖ ద్వారా తెలియజేశారు. తనకు ఏ నియోజకవర్గం కేటాయించొద్దని కూడా ఆయన తన లేఖలో నడ్డాను కోరారు. ‘పార్టీ నాకు గత 40 ఏళ్లుగా బాధ్యతలు అప్పగించింది. నేను బూత్ ఇన్ఛార్జీ నుంచి రాష్ట్ర పార్టీ చీఫ్ వరకు పనిచేశాను. నేను ఉపముఖ్యమంత్రిని కూడా అయ్యాను’ అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.
శివమొగ్గ నుంచి పోటీ చేయబోనంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఈశ్వరప్ప లేఖ రాశారని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ధృవీకరించారు. యువతరం కోసం సీనయర్లు రాజకీయాలనుంచి తప్పుకోవడం అనే గొప్ప సంస్కృతి బీజేపీలో ఉందని బొమ్మై చెప్పారు. నిజానికి ఆయన పోటీ చేయబోనని గతంలోనే ప్రకటించినా పోటీ చేయాలని తాము కోరామని తెలిపారు. అయితే ఆయన తన క్యాడర్‌తో మాట్లాడాక రాజకీయాలనుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారని బొమ్మై వెల్లడించారు.
మరోవంక, ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాజీ సీఎం జగదీష్ షెట్టార్‌కు బీజేపీ కేంద్ర నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇతరులు బరిలో నిలిచేందుకు వీలుగా పోటీ నుంచి తప్పుకోవాలని జగదీష్ షెట్టార్‌కు పార్టీ అగ్రనాయకత్వం సూచించింది. కాగా, కర్ణాటకలో ఈ ఎన్నికల్లో బీజేపీ 150 స్థానాల్లో గెలవబోతుందని ఈశ్వరప్ప జోస్యం చెప్పారు. జాతీయవాద ముస్లింలు బీజేపీ వెంటే ఉంటారని ఆయన చెప్పారు.