దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లను సీబీఐ జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో విచారణకు ఈ నెల 16న సీబీఐ కార్యాలయంలో హాజరు కావాలని అందులో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను సీబీఐ ప్రశ్నించనున్నది.
అయితే ఒక ముఖ్యమంత్రికి సీబీఐ సమన్లు జారీ చేయడం ఇదే తొలిసారిగా తెలుస్తున్నది. ఢిల్లీతోపాటు పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని జాతీయ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇటీవల గుర్తించింది. ఈ తరుణంలో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు శుక్రవారం సమన్లు జారీ చేయడం గమనార్హం.
కాగా, ఈ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్ట్ చేయగా ఆయన జైలులో ఉన్నారు. శుక్రవారం ఒక కార్యక్రమంలో మాట్లాడిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ దీని గురించి ప్రస్తావించారు.
‘దేశ పురోగతిని కోరుకోని అనేక దేశ వ్యతిరేక శక్తులు దేశంలో ఉన్నాయి. వీరంతా మనీష్ సిసోడియాను జైలుకు పంపారు. సిసోడియాను జైలుకు పంపిన వారు దేశానికి శత్రువులు’ అని పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఆప్ ప్రభుత్వం పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని పలుసార్లు ఆయన ఆరోపించారు.
మరోవైపు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బీజేపీ అధికారంలో ఉన్న గోవా పోలీసుల నుంచి కూడా సమన్లు అందాయి. ప్రజా ఆస్తులను పాడు చేశారన్న ఆరోపణకు సంబంధించిన కేసుపై విచారణకు ఈ నెల 27న హాజరుకావాలని అందులో పేర్కొన్నారు.