రాష్ట్రంలో కుటుంబ పాలనను అంతం చేసి కాషాయ జెండాను ఎగురవేసేందుకు ఒకే ఒక్క ఛాన్స్ ఇస్తే రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి మొదటి సంతకం చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రకటించారు. రాష్ట్రంలో 30లక్షల మంది జీవితాలను సర్వనాశనం చేసిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
హనుమకొండ జిల్లా కేంద్రంలోని కాకతీయ విశ్వవిద్యాలయం జంక్షన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు వేలాది మంది నిరుద్యోగ యువకులు, బీజేపీ కార్యకర్తలు శనివారం సాయంత్రం నిరుద్యోగ మార్చ్‌ని నిర్వహించగా, బండి సంజయ్, ఓబీసీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె. లక్ష్మణ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావులు జిల్లా నేతలతో కలిసి ముందువరుసలో నడిచారు.
పేపర్ లీకేజీ వ్యవహరంలో మీ బండారం బయటపడుతుందనే టీఎస్పీఎస్సీ కమిటీ చైర్మన్‌ను తొలగించలేదని, కమిటిని రద్దుచేయలేదని సంజయ్ ధ్వజమెత్తారు. తప్పుచేశారంటూ మంత్రివర్గంలో ఉన్న ఈటల రాజేందర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని, ఉప ముఖ్యమంత్రిని మంత్రివర్గం నుంచి తొలగించారని, పది మంది ఎమ్మెల్యేలను బయటకు పంపించారని గుర్తు చేశారు.
మరి లిక్కర్ స్కాంలో ఉన్న బిడ్డ కవితపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో ప్రధాన సూత్రధారుడిగా ఉన్న కొడుకు కేటిఆర్‌ను మంత్రివర్గం నుంచి ఎందుకు తొలగించడంలేదు? పార్టీ నుంచి మెడలు పట్టి బయటకు ఎందుకు తోయడంలేదని సంజయ్ ప్రశ్నించారు. నిరుద్యోగుల సమస్యలకు పరిష్కారం లభించేవరకు నిరుద్యోగులకు అండగా భారతీయ జనతాపార్టీ ఉంటుందని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో నిరుద్యోగ మార్చ్‌ను నిర్వహిస్తామని బండి సంజయ్ తెలిపారు. ఏప్రిల్ 21న పాలమూరు గడ్డపై నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
తెలంగాణ ఉద్యమంలో మిలియన్ మార్చ్ ను తలపిస్తున్న నిరుద్యోగ మార్చ్ రాష్ట్రంలో కేసిఆర్ ప్రభుత్వ పతనానికి వరంగల్ గడ్డమీద జరుగుతున్న నిరుద్యోగ మార్చ్ నాందీ పలుకుతుందని బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో నియంత కేసిఆర్ పాలనను కూకటివేళ్లతో కూల్చివేయడానికి అందరి జెండా ఒక్కటి కావాలి, అందరి ఏజెండా ఒక్కటి కావాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. కేసిఆర్ ప్రభుత్వం గంగలోకలవడం ఖాయమని ఈటల రాజేందర్ జోష్యం చెప్పారు.