మరాఠా యోధుడు చత్రపతి శివాజీ వాడిన ఖడ్గాన్ని బ్రిటన్ నుంచి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సుధీర్ ముంగంటివార్ తెలిపారు. దీని కోసం వచ్చే నెలలో బ్రిటన్ వెళ్తున్నట్లు ఆయన చెప్పారు. 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉపయోగించిన కత్తి, బాకును తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు.
ఆదివారం రాయ్‌గఢ్ జిల్లాలోని ఖర్ఘర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరైన కార్యక్రమంలో ముంగంటివార్ మాట్లాడారు. శివాజీ మహారాజ్ పట్టాభిషేకం 350వ వార్షికోత్సవాన్ని త్వరలో ఘనంగా జరుపుకుంటామని తెలిపారు.
కాగా, మరాఠీ ప్రజల వీక్షణ కోసం ‘జగదాంబ’ ఖడ్గం, ‘వాఘ్-నఖ్’ (పులి గోళ్లలా కనిపించే బాకు)ను అందుబాటులో ఉంచాలని బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ అలాన్ గెమ్మెల్, రాజకీయ, ద్వైపాక్షిక వ్యవహారాల డిప్యూటీ హెడ్ ఇమోజెన్ స్టోన్‌తో చర్చించినట్లు మంత్రి సుధీర్ ముంగంటివార్ తెలిపారు.
‘నేను మే మొదటి వారంలో బ్రిటన్‌కు వెళ్తున్నాను. శివాజీ మహారాజ్ పట్టాభిషేకం 350 వ వార్షికోత్సవం కోసం ఆయన వినియోగించిన ఖడ్గం, బాకును మహారాష్ట్రకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను’ అని వెల్లడించారు.