మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను సిబిఐ అధికారులు ఆదివారం తొమ్మిది గంటలపాటు సుదీర్ఘంగా విచారించారు. కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) కార్యాలయంలో అధికారుల ముందు కేజ్రీవాల్ మధ్యాహుం 12 గంటల సమయంలో హాజరయ్యారు.
లిక్కర్ కుంభకోణంలో సాక్షిగా వాంగ్మూలం నమోదుకే కేజ్రీవాల్‌ను సిబిఐ ప్రశ్నించిన్నట్లు సమాచారం. లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో జరిగిన అక్రమాలు, కమీషన్ రేట్లను పెంచడం, సీఎంగా కేజీవాల్ పాత్ర గురించి ఆయన్ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు రూ. 100 కోట్ల ముడుపులు, విజయ్ నాయర్, ఇతర నిందితులతో సంబంధాలపై ఆరా తీశారు.
మనీష్ సిసోడియా సహా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకున్న నిర్ణయానికి సీఎం ఆమోదం, సౌత్ గ్రూప్ సంబంధాలు, ఎక్సైజ్ అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా కేజీవాల్ ను అధికారులు ప్రశ్నించారు.
అంతకుముందు ఆయన రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ సమాధి వద్ద ప్రార్థనలు చేశారు. అక్కడి నుంచి సిబిఐ కార్యాలయానికి వెళ్లారు. కేజ్రివాల్కుమద్దతుగా సిబిఐ కార్యాలయానికి వెళ్లిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఢిల్లీ రాష్ట్ర మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్, ఆమ్ ఆద్మీ సీనియర్ నేతలు ధర్నా చేశారు.
కేజ్రీవాల్ విచారణ సందర్భంగా సిబిఐ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. భారీ స్థాయిలో పోలీస్ బలగాలు మోహరించాయి. కేజ్రీవాల్‌ను తమతోపాటు తీసుకెళ్లే వరకు సిబిఐ ప్రధాన కార్యాలయం నుంచి కదిలేది లేదని ఆప్ నేతలు స్పష్టం చేశారు.
కేజ్రీవాల్‌కు సిబిఐ సమన్లను వ్యతిరేకిస్తూ ఢిల్లీ వీధుల్లో ఆప్ కార్యకర్తలు ప్రదర్శనలు నిర్వహించారు. ఎంపిలు, ఎమ్మెల్యేలు, మంత్రులుసహా దాదాపు 1,500 మంది ఆప్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని బస్సుల్లో వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఆప్ ఎంపి సంజరు సింగ్ మాట్లాడుతూ కేజ్రీవాల్ మంచి విద్య, వైద్య విధానాన్ని దేశానికి ఇచ్చినందుకు శిక్షిస్తున్నారని విమర్శించారు. ఆప్ ఎంపి రాఘవ్ చద్దా మాట్లాడుతూ, కేజ్రీవాల్‌ను జైలులో పెట్టి, ఆమ్ ఆద్మీ పార్టీని నాశనం చేయడమే బిజెపి ఏకైక లక్ష్యమని మండిపడ్డారు. 32 మంది ఢిల్లీ ఎమ్మెల్యేలు, 70 మంది కౌన్సిలర్లు, ఢిల్లీ సరిహద్దుల్లో 20 మంది పంజాబ్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేసినట్లు ఆప్ తెలిపింది.
‘ఈ మద్యం పాలసీ కేసు పూర్తిగా అవాస్తవం. నిజాయితీనే ఆప్ సిద్ధాంతం. చావనైనా చస్తాం గానీ, నిజాయితీతో రాజీపడబోం. ఢిల్లీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నంలోనే ఈ కేసును తెరమీదకి తీసుకొచ్చారు. ఆప్ జాతీయ పార్టీగా అవతరించింది. దీన్ని అడ్డుకునేందుకే ఇలా చేస్తున్నారు’ అని ధ్వజమెత్తారు.