నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సిపి) అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు రాజకీయ కురువృద్ధుడు, మహారాష్ట్రకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్ ప్రకటించడం రాజకీయ దుమారం రేపింది. ఎన్‌సిపి అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు శరద్ పవార్ ఎలిపారు.
తన ఆత్మకథ లోక్ మఝే సంగాయి-రాజకీయ ఆత్మకథ..విడుదల సందర్భంగా శరద్ పవార్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఎప్పుడు ఆగాలో తనకు తెలుసునని, తదుపరి అధ్యక్షుడిపై నిర్ణయం తీసుకునేందుకు ఎన్‌సిపి సీనియర్ నాయకులతో ఒక కమిటీని ఏర్పాటు చేశానని 82 ఏళ్ల శరద్ పవార్ తన కుమార్తె ప్రతిభ సమక్షంలో ప్రకటించారు.
అయితే, గత 55 ఏళ్లుగా కొనసాగుతున్న తరహాలోనే సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటూనే ఉంటానని ఆయన పార్టీ శ్రేణులకు హామీ ఇచ్చారు. కాగా, పవార్ రాజ్యసభ సభ్యత్వం కాలపరిమితి మరో మూడేళ్లు ఉంది. అప్పటివరకు ఆ పదవిలో ఉంటానని, ఆ తర్వాత మరేపదవి చేపట్టానని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే..శరద్ పవార్ హఠాత్తుగా చేసిన ఈ ప్రకటన పార్టీ కార్యకర్తలు, నాయకులలో దిగ్భ్రాంతిని కలగచేసింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన అభిమానులు తమ అధినాయకుడి నిర్ణయం పట్ల కళ్లనీళ్లు పెట్టుకున్నారు. పవార్ రాజకీయాలలో కొనసాగాలని, దేశానికి ఆయన సేవలు ఇంకా అవసరమంటూ వారు పెద్దపెట్టున నినాదాలు చేశారు.
ఈ నేపథ్యంలో శరద్ పవార్ పార్టీ క్యాడర్‌ను ఉద్దేశించి మాట్లాడారు. వృద్ధాప్యం, ఆరోగ్య సమస్యల కారణంగా తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. పార్టీలో ఎప్పటిలాగే అందరం కలిసి పనిచేద్దామని, తన రాజీనామాకు అందరూ ఆమోదం తెలుపాలని ఆయన కోరారు.
తాను రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలగడం లేదని, తన పొలిటికల్ లైఫ్ ఎప్పటిలాగే కొనసాగుతుందని, కాకపోతే పార్టీ అధ్యక్ష పదవిని వదిలేయడంతోపాటు ఇకపై ఎన్నికల్లో పోటీచేయబోనని చెప్పారు. అయినా ఎన్సీపీ శ్రేణులు ఒప్పుకోవడం లేదు. శరద్ పవార్‌తో మాట్లాడి రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఒప్పించాలని ఆయన కుమార్తె సుప్రియా సూలేకు విజ్ఞప్తి చేశారు.
ఈ నేపథ్యంలో శరద్ పవార్ అన్న కొడుకు, మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ పెద్దాయన వయసును, ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుని ఆయన నిర్ణయాన్ని గౌరవించాలని కోరారు. ఆయన గట్టిగా నిర్ణయం తీసుకున్నారని, ఇక ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గే అవకాశమే లేదని చెప్పారు.
రాజీనామా వెనక్కి తీసుకోవాలని సుప్రియా సూలే తన తండ్రి పవార్‌ను కోరే ప్రయత్నం చేసిందని, కానీ ఆమెకు పెద్దన్నగా తాను ఆమె ప్రయత్నాన్ని అడ్డుకున్నానని అజిత్ పవార్ చెప్పారు. అధ్యక్షుడిగా శరద్ పవార్ రాజీనామా చేసిన నేపథ్యంలో తదుపరి అధ్యక్షుడిగా ఎంపికయ్యే వ్యక్తి శరద్ పవార్ మార్గదర్శకత్వంలో పనిచేస్తారని అజిత్ పవార్ తెలిపారు.
పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీలో ఎన్‌సిపి సీనియర్ నాయకులు ఉన్నారు. వారిలో ప్రఫుల్ పటేల్, సునీల్ తత్కరే, పిసి చాకో, నరహరి జర్వాల్, అజిత్ పవార్, సుప్రియా సూలే, జయంత్ పాటిల్, ఛగన్ భుజ్‌బల్, దిలీప్ వాల్సే పాటిల్, అనిల్ దేశ్‌ముఖ్, రాజేష్ తోపె, జితేంద్ర అవ్హాద్, హసన్ ముష్రిఫ్, ధనంజయ్ ముండె, జయదేవ్ గైక్వాడ్, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు ఉంటారని అజిత్ పవార్ తెలిపారు.