జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు, ఆర్మీ అధికారులకు మధ్య జరుగుతున్న ఎదురుకాల్పులలో ఐదుగురు జవాన్లు శుక్రవారం మృతి చెందగా, శనివారం ఉదయం ఒక ఉగ్రవాది చనిపోయాడు. మరో జవాను తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు.
బారాముల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడని జిల్లా ఎస్పీ అమోద్ అశోక్ తెలిపారు. అతను లష్కరే తొయీబాకు చెందిన ఉగ్రవాదిగా గుర్తించామని వెల్లడించారు. బారాముల్లా జిల్లాలోని కుంజర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారాన్ని అందుకున్న పోలీసులు, భద్రతా బలగాలు శనివారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించాయి.
ఈ క్రమంలో ఉగ్రవాదుల బృందంపై కాల్పులు జరపగా ఓ ఉగ్రవాది హతమయ్యాయడు. బారాముల్లాలో గత నాలుగు రోజులలో ఇది మూడో ఎన్కౌంటర్ కాగా ఇప్పటికే నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.
కాగా, జమ్మూ కాశ్మీర్ లో భద్రతా పరిస్థితిని సమీక్షించేందుకు ఇవాళ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే శనివారం జమ్మూలో పర్యటిస్తున్నారు. రాజౌరీ జిల్లాలోని కాండి అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడిన మరుసటి రోజే ఈ ఎన్కౌంటర్ జరిగింది.
మంగళవారం జమ్మూలోని తోటగాలి ప్రాంతంలో ఆర్మీ ట్రక్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ దాడికి పాల్పడిన వారు రాజౌరి జిల్లాలోని కండి ఫారెస్ట్ ప్రాంతంలో ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి ఆర్మీకి సమాచారం అందింది. దీంతో గురువారం నుంచి ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.
ఆపరేషన్‌లో భాగంగా శుక్రవారం ఉదయం 7:30 గంటల ప్రాంతంలో ఉగ్రవాదుల జాడను ఆర్మీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ఆర్మీ అధికారులు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. అక్కడి నుంచి తప్పించుకునేందుకు ఉగ్రవాదులు పేలుడు పదార్థాన్ని ప్రయోగించారు.
ఈ పేలుడులో ఇద్దరు భద్రతా సిబ్బంది ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఉధంపుర్లోని కమాండ్ ఆసుపత్రికి తలించారు. చికిత్స పొందుతూ మరో ముగ్గురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ ఉగ్రవాదులు ఆ ప్రాంతంలోనే దాక్కొని ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజౌరీ జిల్లాలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.
ఇటీవల జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఆర్మీ ట్రక్కు పేలి ఐదుగురు సైనికులు మృతి చెందిన విషయం తెలిసిందే. జవాన్లతో వెళ్తున్న ట్రక్కుపై ఉగ్రవాదులు గ్రనేడ్ దాడి చేయడంతో ఐదుగురు జవాన్లు సజీవ దహనమయ్యారు. భారీ వర్షాలు, విజిబులిటీ సరిగా లేకపోవడం వంటి పరిస్థితులను అనుకూలంగా మలచుకొని సైనికులు వెళ్తున్న ట్రక్కును లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు దిగారు.
శ్రీనగర్‌లో జరగనున్న జీ-20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాన్ని వ్యతిరేకించిన లష్కరే తాయిబా అనుబంధ సంస్థ పీపుల్స్ యాంటీ-ఫాసిస్ట్ ఫ్రంట్ ఈ దాడి జరిపింది. 2019లో అల్ ఖాయిదా ప్రేరణతో పురుడుపోసుకున్న ఈ ఉగ్రసంస్ జైషే మహమ్మద్‌కు అనుబంధంగా పనిచేస్తోంది.
యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తూ రిక్రూట్మెంట్లకు పాల్పడుతోంది. జమ్మూకశ్మీర్‌లో జరిగిన పలు ఉగ్రదాడుల్లో పీపుల్స్ యాంటీ-ఫాసిస్ట్ ఫ్రంట్ పాత్ర ఉండడం, దేశంలోని పలు ప్రాంతాల్లో విధ్వంసాలకు కుట్రలు పన్నడంతో కేంద్ర హోంశాఖ ఈ ఏడాది జనవరిలో ఈ సంస్థపై నిషేధం విధించింది.