ఖమ్మం మాజీ ఎంపీ, బిఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని చేర్చుకునేందుకు ఒక వంక కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పెద్దఎత్తున కసరత్తు చేస్తుండగా, ఆయన మాత్రం ఎటువైపు మొగ్గు చూపించకుండా సొంతంగా ఒక పార్టీ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇటీవల `తెలంగాణ రైతు సమాఖ్య’ (టిఆర్ఎస్) పేరుతో ఎన్నికల కమీషన్ వద్ద నమోదైన పార్టీ వెనుక ఆయనే ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.
ఈ ప్రయత్నంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు బిఆర్ఎస్ పట్ల అసంతృప్తిగా ఉన్న పలువురు నేతలు కూడా ఆయనతో కలసి వచ్చేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తున్నది. అనూహ్యంగా 2014 ఎన్నికలలో ఖమ్మం నుండి వైసిపి అభ్యర్థిగా పోటీచేసి, రాజకీయ రంగప్రవేశం చేసి ఎన్నికలలో గెలుపొందడం ద్వారా అందరి దృష్టి ఆకట్టుకున్నారు.
ఆ తర్వాత తనతో పాటు కొందరు ఎమ్యెల్యేలతో కలిసి బిఆర్ఎస్ లో చేరినా 2019లో సీట్ ఇవ్వకుండా చేయడమే కాకుండా, ఆ తర్వాత సహితం ఎటువంటి పదవి ఇవ్వకుండా, పార్టీలో అసలు ప్రాధాన్యత ఇవ్వకుండా చేస్తూ ఉండడంతో కొంతకాలంగా తనదారి చూసుకొనే ప్రయత్నాలో ఉన్నారు. గత నాలుగేళ్లుగా ఎటువంటి పదవి లేకపోయినా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన మద్దతుదారులను సమకూర్చుకున్నట్లు చెబుతున్నారు.
అనుకునే ఆయనకోసం కాంగ్రెస్, బిజెపి పోటీపడుతున్నాయి. అయితే తనతో పాటు తన మద్దతుదారులకు కూడా కలిపి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని సీట్లు ఇవ్వాలని పట్టుబడుతూ ఉండడంతో మరో పార్టీలో చేరడంకు ఆటంకం కలుగుతుంది. అందుకనే కర్ణాటక ఎన్నికల ఫలితాల వరకు వేచిచూసి, తన రాజకీయ ప్రయాణం గురించి ఒక నిర్ణయం తీసుకొనేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తున్నది.
ఇప్పటికే పలు జిల్లాలోని పలువురు ముఖ్య నేతలతో లోతుగా చర్చలు జరుపుతున్నారు పొంగులేటి. కనీసం 50 సీట్లలో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపి, వారిలో సగం మందిని గెలిపించుకున్నా ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటులో కింగ్ మేకర్ కావచ్చని అంచనాగా చెబుతున్నారు.