కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ పోటాపోటీగా ప్రచారం చేస్తూ.. ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. కాగా, కర్ణాటకలో మళ్లీ బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగారు.
గతంలో మరే రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనంత విస్తృతంగా కర్ణాటక నలువైపులా సుడిగాలి పర్యటనలు జరిపి, ప్రచార సభలలో పాల్గొంటున్నారు. 20కు పైగా ర్యాలీలు, పలు నగరాలలో రోడ్ షో లలో పాల్గొన్నారు. ఇప్పుడు బెంగళూరులో ప్రధాని రోడ్ షో శనివారం అట్టహాసంగా మొదలైంది.
ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ భారీ రోడ్ షో 13 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 26 కిలోమీటర్ల మేర సాగనుంది. జేపీ నగర్ లో ప్రధాని మోడీకి బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ రోడ్ షో జేపీ నగరంలోని బ్రిగేడ్ మిలీనియం నుంచి బెంగళూరు సెంట్రల్లోని మల్లేశ్వరంలోని మారమ్మ సర్కిల్ వరకు జరగనుంది.
రోడ్డుకు ఇరువైపులా నిల్చొని జైహో మోదీ నినాదాలతో స్వాగతించారు. అదే విధంగా రోడ్డుకు ఇరువైపులా పూల వర్షం కురిపిస్తూ ప్రధానికి సాదర స్వాగతం పలుకుతున్నారు. ప్రధాని మోడీ చేపట్టిన ఈ భారీ రోడ్ షోకు బీజేపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అశేష జన వాహిని మధ్య ఈ రోడ్ షో సాగుతుండగా ప్రధాని మోదీ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు.
ఈ సందర్భంగా భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్న ప్రజలు, పార్టీ కార్యకర్తలు ప్రధాని మోడీపై పువ్వులు చల్లుతూ మద్దతు పలికారు. ఈ క్రమంలోనే అధికారులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. బెంగళూరులోని దాదాపు 34 రోడ్లను మూసివేసినట్టు తెలుస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బలగాలు మోహరించి, పరిస్థితిని అదుపులో ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు.
ఇంతకుముందు మే 6న 10 కిలోమీటర్లు, 7న 26 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించాలని భావించారు. కానీ ఆదివారం నీట్ పరీక్ష వల్ల ఉన్నందువల్ల ఇవాళ 26 కిలోమీటర్ల రోడ్ షో నిర్వహిస్తుండగా.. ఆదివారం తిప్పసంద్రలోని కెంపేగౌడ విగ్రహం నుంచి ట్రినిటీ వరకు 10 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 11.30 గంటల వరకు ఇది జరగనుంది. మొత్తం రెండు రోజుల పాటు కర్ణాటకలో మోదీ రోడ్ షో జరగనుంది.