“మధ్యాహ్నం 12 గంటలకు మేల్కొనే వారు యువకులు కాదు. కరోనా మహమ్మారి సమయంలో ప్రజలను తప్పుదోవ పట్టించిన వారు, వ్యాక్సిన్‌ను వ్యతిరేకించిన వారు యువకులు కాదు. వీరు అలసిపోయిన, పదవీ విరమణ చేసిన వ్యక్తులు. వారి నుండి ఏమీ ఆశించవద్దు” అంటూ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రతిపక్ష నేతలను ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలోని విద్యార్థులకు కోటి టాబ్లెట్లు, స్మార్ట్ఫోన్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాజపేయి జయంతి సందర్భంగా, ఆయన పేరున గల లక్నో స్టేడియంలో 60,000 మందికి పైగా విద్యార్థులకు పరికరాలను పంపిణీ చేయడం ద్వారా ఈ డ్రైవ్‌ను ప్రారంభించారు.
విద్యార్థులలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు చెందిన వారు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందుతున్న వారు కూడా ఉన్నారు. మహమ్మారి సమయంలో సాంకేతిక పరిజ్ఞానం ప్రాముఖ్యత స్పష్టంగా కనిపించిందని ముఖ్యమంత్రి చెప్పారు.
పిల్లలకు ఆన్లైన్ విద్య, తరగతుల సౌకర్యం లేనందున కోటి మంది యువతను టెక్నాలజీతో అనుసంధానం చేసి ట్యాబ్లెట్లు, స్మార్ట్ఫోన్లు అందజేయాలని అప్పుడే నిర్ణయించుకున్నామని తెలిపారు. .
లాక్ డౌన్ సమయంలో రాజస్థాన్ లోని కోటాలో చిక్కుకు పోయిన పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులను తిరిగి తీసుకురావడానికి తన ప్రభుత్వం ప్రయత్నించినప్పుడు, సహకరించడానికి అక్కడి కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ ప్రభుత్వం నిరాకరించిందని ఆదిత్యనాథ్ తెలిపారు. మన విద్యార్థులను ఇంటికి చేర్చడానికి తమ ప్రభుత్వం బస్సులను పంపవలసి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలోని గత ప్రభుత్వాలు “భాయి-భతిజావద్” (బంధుప్రీతి)ని ప్రోత్సహించాయని, ఉద్యోగ నియామకాల ముసుగులో దోపిడీకి పాల్పడుతున్నాయని ముఖ్యమంత్రి ఆరోపించారు. “మా ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాల పదవి కాలంలో 4.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను అందించింది” అని గుర్తు చేశారు, 2017 కంటే ముందు 10 సంవత్సరాలలో 2 లక్షల కంటే తక్కువ ఉద్యోగాలు మాత్రమే అందించారని పేర్కొన్నారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. కొన్ని నెలల్లో దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలకు కేంద్రం ఇంటర్నెట్ కనెక్టివిటీని అందజేస్తుందని చెప్పారు. ఆదిత్యనాథ్ పంపిణీ చేసిన అన్ని పరికరాల్లో ఇన్స్టాల్ చేసిన ‘డిజి శక్తి పోర్టల్’, ‘డిజి శక్తి అధ్యయన్ యాప్’ని కూడా ప్రారంభించారు. వీటి ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలతోపాటు స్టడీ మెటీరియల్‌కు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంటుందని చెప్పారు.