రాజకీయ ప్రకంపనాలు సృష్టిస్తున్న ‘ఢిల్లీ మద్యం విధానం’లో అసలు కుంభకోణం ఎక్కడ ఉన్నదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని ఢిల్లీలోని రౌస్అవెన్యూ కోర్టు ప్రశ్నించింది. ఈ కేసులో ఈడీ తగిన సాక్ష్యాధారాలతో దర్యాప్తు కొనసాగించడం లేదని అసహనం వ్యక్తంచేసింది. స్టేట్మెంట్ల సాయంతో తప్ప, ఆధారాలకు అనుగుణంగా ఈ దర్యాప్తు కొనసాగడం లేదని అభిప్రాయపడింది.
అప్రూవర్ చెప్పిన వివరాలనే ఈడీ ప్రామాణికంగా తీసుకోవడంపైనా ఆగ్రహం వ్యక్తంచేసింది. రూ. 100 కోట్ల అక్రమాలు జరిగినట్టు చెప్తున్న ఈడీ నగదును మాత్రం లక్షల్లోనే చూపించడంపై విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ విస్మయం వ్యక్తంచేశారు.
ఈ కేసుకు సంబంధించి శనివారం రాజేశ్ జోషి, వ్యాపారవేత్త గౌతమ్ మల్హోత్రాకు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు వెలువరించారు. మద్యం పాలసీలో అక్రమ లావాదేవీలు జరిగాయనడానికి ఈడీ తగిన ఆధారాలు చూపించట్లేదని కోర్టు అభిప్రాయపడింది.
ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ కావడం, బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవితను సహితం నిందితురాలిగా అనుమానిస్తూ ఉండడంతో సహజంగానే విచారణ రాజకీయంగా కలకలం రేపుతోంది.
‘సౌత్‌గ్రూప్ రూ.30 కోట్లు ఇచ్చిందని అప్రూవర్ దినేశ్ చెప్తున్నారు. ఆరోపణలు కోట్ల రూపాయల్లో ఉండగా.. నగదు మాత్రం లక్షల్లోనే కనిపిస్తున్నది. ఇంత భారీ అవినీతి వ్యవహారంలో హవాలాకు పాల్పడిన వాళ్లను ఎవరినీ ఈడీ విచారించలేదు. కేవలం కేసులోని వాళ్లు, అప్రూవర్ల స్టేట్మెంట్ ఆధారంగానే ఈడీ ఈ కేసులో ముందుకు వెళ్తున్నది’ అంటూ ధర్మాసనం అసహనం వ్యక్తంచేసింది.
‘మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్-45 నాన్ బెయిలబుల్ సెక్షన్. అయితే అందుకు సంబంధించిన కీలక సాక్ష్యాధారాల్ని చూపలేకపోయింది’ అని ఈడీ దర్యాప్తు తీరును తప్పుపట్టిన న్యాయస్థానం.. ఈ కారణంగానే నిందితులు రాజేశ్ జోషి, మల్హోత్రాకు బెయిల్ ఇస్తున్నట్టు స్పష్టంచేసింది.
మరోవంక, ఢిల్లీ మద్యం పాలసీ కేసులో దేశానికి ప్రాతినిధ్యం వహించే దర్యాప్తు సంస్థలు దక్షిణాది ప్రాంతాన్ని అవమానించేలా ‘సౌత్ గ్రూప్’ అనే పదాన్ని ఎలా వినియోగిస్తాయని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. సీబీఐ, ఈడీల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఢిల్లీ మద్యం పాలసీ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ, ఈడీవంటి దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థలు చార్జిషీట్లు, ఎఫ్ఐఆర్లలో ‘సౌత్ గ్రూప్’ అనే పదాన్ని వాడి దక్షిణాది రాష్ట్రాల ప్రజల మనోభావాలను దెబ్బతీశాయంటూ హైదరాబాద్‌కు చెందిన పటోళ్ల కార్తీక్‌రెడ్డి సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు.
సీబీఐని ప్రతివాదిగా చేర్చుతూ దాఖలు చేసిన ఈ పిల్‌పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఇదే కేసులో ఉత్తరాది ప్రాంతానికి చెందినవారు కూడా ఉన్నారని, వారిని ‘నార్త్ గ్రూప్’గా సీబీఐ ఎక్కడా సంబోధించలేదని పిటిషనర్ తరఫున న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.