కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. మే 13న ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న విషయంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మే 10న కర్ణాటకలోని 224 నియోజకవర్గాలకు ఎలక్షన్స్ జరగగా, అదే రోజులు కొన్ని ఎగ్జిట్ పోల్ ఏజెన్సీలు ఫలితాల అంచనాలను రిలీజ్ చేశాయి.
ఈ ఎగ్జిట్ పోల్స్ లో కొన్ని ఏజెన్సీలు హంగ్ ఏర్పడుతుందని చెప్పగా, హెచ్డి కుమారస్వామికి చెందిన జనతాదళ్ (సెక్యులర్) కీలక పాత్ర పోషించడంతో కాంగ్రెస్‌కు స్వల్ప ప్రయోజనం చేకూరుతుందని మరికొన్ని ఏజెన్సీలు సూచిస్తున్నాయి. ఈ సారి జరిగిన ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ యొక్క జేడీ (ఎస్) మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.
రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాల్లో మే 13న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది, మధ్యాహ్నం నాటికి ఫలితంపై స్పష్టమైన సమాచారం వెలువడే అవకాశం ఉందని పోల్ అధికారులు భావిస్తున్నారు. ఇక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎక్కడా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకించి కౌంటింగ్ కేంద్రాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఫలితాలు వెలువడిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటులో తాము ఏ పార్టీకి మద్దతివ్వాలో ఇప్పటికే నిర్ణయించుకున్నామని జనతాదళ్ (సెక్యులర్) జాతీయ అధికార ప్రతినిధి తన్వీర్ అహ్మద్ తెలిపారు. ‘ఎవరితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది ఇప్పటికే నిర్ణయించుకున్నామని.. తగిన సమయం వచ్చినప్పుడు ప్రజలకు తెలియజేస్తాం’ అని ఆయన తెలియజేశారు.
ఇంతకుముందు జేడీ(ఎస్) సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 14నెలల్లోనే విఫలమై, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమయంలో బి ఎస్ యడియూరప్ప సీఎంగా ఉండగా.. ఆ తర్వాత బసవరాజు బొమ్మై సీఎంగా కొనసాగారు.కాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనాతా పార్టీ విజయానికి ఢోకా లేదని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఎవరనేది శాసనసభాపక్షం నిర్ణయిస్తుందని చెబుతూ రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ వస్తుందంటూ ఎగ్జిట్ పోల్స్ జోస్యాన్ని ఆయన కొట్టివేశారు.
”హంగ్ అసెంబ్లీకి అవకాశమే లేదు. మేము సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. రేపటి వరకూ (ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు) 141 సీట్లు గెలుచుకుంటామనే ఆనందంలో ఆయనను (డీకే శివకుమార్) ఉండనీయండి. బీజేపీ శాసనసభా పక్షం సమావేశంలో సీఎం ఎవరనేది నిర్ణయిస్తారు” అని బొమ్మై శుక్రవారంనాడు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ చెప్పారు. చాలా ఎగ్జిట్ పోల్స్ సర్వేలు కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ స్థానాలు వస్తాయని ప్రకటించాయని, దాంతో రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుందనే ప్రచారం జరుగుతున్నదని, వాస్తవానికి మాత్రం కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతున్నదని ఆయన ధీమా వ్యక్తంచేశారు. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు మా పార్టీ అంచనాలు కావని, అవి ఆయా సంస్థల సొంత అంచనాలని, మేం ఆ అంచనాలను పరిగణలోకి తీసుకోవడం లేదని, మా అంచనాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ 141 స్థానాల్లో విజయం సాధిస్తుందని జోష్యం చెప్పారు.