రెజర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్‌పై విచారణకు స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్(సిట్) ఏర్పాటైంది.
మరోవైపు ఈ కేసు విచారణలో తాజా పరిస్థితిపై నివేదిక సమర్పించాలని బుధవారం కోర్టు ఆదేశించగా శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సీల్డ్ కవర్లో నివేదికను అందజేశారు. దీంతో కోర్టు తదుపరి విచారణను మే 27కు వాయిదా వేసింది. మరోవైపు బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు చేపట్టాలని రెజ్లర్లు చేస్తున్న ఆందోళన కొనసాగుతుండగా ఆయనను ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారు.
బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌తో పాటు డబ్ల్యూఎఫ్ఐ సహాయక కార్యదర్శి వినోద్ తోమర్ వాంగ్మూలాన్ని పోలీసులు తీసుకున్నారు. ఓ మైనర్‌తో సహా ఏడుగురు మహిళా రెజ్లర్ల ఫిర్యాదు మేరకు బ్రిజ్‌భూషణ్‌పై పోక్సో చట్టంతో పాటు ఇతర సెక్షన్ల కింద రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన విషయం తెలిసిందే.
విచారణకు సహకరించాలని నోటీసులు పంపిన పోలీసులు సుమారు 3 గంటల పాటు బ్రిజ్‌భూషణ్‌ను విచారించారు. లైంగిక హింస ఆరోపణలను కొట్టేసిన అతను, తనను ఈ కేసులో కావాలనే ఇరికించారని చెప్పినట్లు సమాచారం. దీంతో అందుకు తగిన ఆధారాలను చూపించాలని అతనికి పోలీసులు స్పష్టం చేశారు. విచారణలో భాగంగా వాంగ్ములాలు, సాక్ష్యాలు సేకరించేందుకు పోలీసు బృందాలను ఉత్తర్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, హర్యానాకు పంపించారు.