తాను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ గెలుపొంది ప్రభుత్వం ఏర్పాటు చేసినా, తనకు ముఖ్యమంత్రి పదవి దక్కలేదని మొదటినుండి అసంతృప్తితో మగ్గిపోతున్న కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ తాజాగా తమ పార్టీకి చెందిన రాజస్థాన్ ప్రభుత్వంకు అల్టిమేటం జారీ చేశారు.
తాను కోరిన మూడు డిమాండ్లు నెలాఖరులోగా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఆందోళన తప్పదని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ను సోమవారం హెచ్చరించారు.
రాష్ట్రంలో గత బిజేపి ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై ప్రస్తుత గెహ్లాట్ ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోవడం లేదంటూ అజ్మీర్ నుంచి జైపూర్ వరకు ఐదు రోజుల పాటు సాగించిన పాదయాత్ర ముగింపు సందర్భంగా సోమవారం జరిగిన బహిరంగ సభలో పైలట్ మాట్లాడుతూ ఈ హెచ్చరిక చేశారు.
అవినీతిపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేయాలన్న డిమాండ్‌తోపాటు రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఆర్పిఎస్సి)ను రద్దు చేసి తిరిగి పునరుద్ధరించాలని, పేపర్ లీక్ తరువాత ప్రభుత్వ రిక్రూట్మెంట్ పరీక్షల రద్దు వల్ల నష్టపోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలని, పైలట్ డిమాండ్ చేశారు.
కర్ణాటకలో ముఖ్యమంత్రి నియామకంపై కాంగ్రెస్ అధిష్ఠాన వర్గం తలమునకలై ఉన్న తరుణంలో రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి గెహ్లాట్, అసమ్మతి నేత పైలట్ మధ్య ఘర్షణ తలెత్తడం చర్చనీయాంశం అవుతోంది. గతంలో కొందరు ఎమ్యెల్యేలతో శిబిరం పెట్టి, ముఖ్యమంత్రి పదవి ఇవ్వనిపక్షంలో బిజెపితో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని బెదిరించి విఫలమైన పైలట్ ఉపముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్ష పదవులను కూడా కోల్పోయారు.
ఆ సమయంలో బిజెపి నుండి ఆశించిన మద్దతు లభించకపోవడానికి మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే కారణమనే ఆగ్రహంతో తరచుగా ఆమెపై విమర్శలు కురిపిస్తున్నారు. పైగా, ఇటీవల ఆమె కారణంగానే పైలట్ తన ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం నుండి గట్టెక్కగలిగానని ఇటీవల అశోక్ గెహ్లాట్ ప్రకటించడంతో పైలట్ మరింతగా రెచ్చిపోతున్నారు. “గెహ్లాట్ నాయకురాలు సోనియా గాంధీ కాదు, వసుంధర రాజే” అంటూ ఎద్దేవా చేశారు.
అయితే గెహ్లాట్, పైలట్ అనవసరంగా తమ మధ్య వివాదాలలో తన పేరును ప్రస్తావించడం పట్ల వసుంధర రాజే ఇటీవల అసహనం వ్యక్తం చేశారు. కొద్దినెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రానుండడంతో కుట్రపూరితంగా తనను అపఖ్యాతి కావించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.