తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ జనాభా ఆధారంగా బడ్జెట్ కేటాయిస్తామని చెబుతూ బిజెపి గురువారం బిసి డిక్లరేషన్ ప్రకటించింది. బిజెపి ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డా. కె లక్ష్మణ్ ఓబీసీల ఆత్మీయ సమ్మేళనంలో ప్రకటించిన డిక్లరేషన్ లో రాష్ట్రంలోని బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పిస్తామని తెలిపారు.
విదేశాల్లో చదివే బీసీ విద్యార్థులకు స్టాచురేషన్ పద్ధతిలో ఆర్థిక సాయం అందిస్తామని, నామినేటెడ్ పదవుల్లోనూ బీసీలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. హైదరాబాద్ లోని పాతబస్తీ అభివృద్ధి చెందకపోవడానికి బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలే కారణమని, పాలకులు అనుసరించిన విధానాల కారణంగానే మెట్రో రావడం లేదని విమర్శించారు.
ట్రిపుల్ తలాక్ ను నిషేధిస్తూ చట్టం తెచ్చిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదని చెప్పారు. దానిని బీఆర్ఎస్, కాంగ్రెస్,ఎంఐఎం పార్టీలు వ్యతిరేకించాయన్నారు. రాష్ట్రంలో బజరంగదళ్ ను నిషేధించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపన్నుతున్నదని బండి సంజయ్ ఆరోపించారు.
నిజానికి రాష్ట్రంలోని ఏ ముస్లిం కూడా బజరంగదళ్ ను నిషేధించాలని కోరుకోవడం లేదన్నారు. తెలంగాణలో బజరంగ్ దళ్ కారణంగా గొడవలు జరగలేదని పేర్కొన్నారు. బీసీల ఆత్మ బలిదానంతో ఏర్పడిన తెలంగాణలో ఆ సామాజిక వర్గమే అన్యాయానికి గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ఓబీసీ విభాగం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ మాట్లాడుతూ..
నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వంలోనే బీసీలకు న్యాయం జరుగుతుందని డా. లక్ష్మణ్ భరోసా ఇచ్చారు. బీసీలకు పెద్దపీట వేసిన మహానుభావుడు ఎన్టీఆర్ అని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత ఆయనదే అని కొనియాడారు.
బీసీలకు ఉన్న రిజర్వేషన్లను కుదించిన చరిత్ర కేసీఆర్ ది అని ధ్వజమెత్తారు. కేసీఆర్ బీసీల ద్రోహి అంటూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీల సీట్లను కేసీఆర్ ముస్లింలకు కేటాయించారని ఆరోపించారు. కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీసీ జనగణన ఎందకు చేయలేదని లక్ష్మణ్ ప్రశ్నించారు.
సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు శ్రీశైలం గౌడ్, నందీశ్వర్ గౌడ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆలె భాస్కర్, గడీల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
బీసీ డిక్లరేషన్ కీలక ఆంశాలు
- జనాభా ఆధారంగా బీసీలకు బడ్జెట్
- రాష్ట్ర బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా
- నామినేటెడ్ పదవుల్లోనూ పెద్దపీట వేస్తం
- విదేశాల్లో చదివే బీసీ విద్యార్థులకు సంతృప్త స్థాయిలో సాయం
- ఎన్నికల్లో గెలిచి రాలేని కులాలకు పదవుల్లో ప్రయార్టీ