సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా దాదాపు రూ. 20 వేల కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాలు ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఉదయం పాత పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద పూజలతో ప్రారంభోత్సం మొదలైంది.
ఉదయం 7.30 నిమిషాలకు తొలుత గణపతి హోమం నిర్వహించారు. అనంతరం అధీనంల నుంచి స్వీకరించిన చరిత్రాత్మక రాజదండానికి సాష్టంగ ప్రమాణం చేశారు. స్పీకర్, అధీనంలతో కలిసి పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించిన నరేంద్ర మోదీ.. లోక్‌సభలో సభాపతి ఛైర్ పక్కన ఆ రాజదండాన్ని ప్రతిష్టాపన చేశారు.
భవన నిర్మాణంలో పాల్గొన్న కార్మికులు, సిబ్బందిని మోదీ ఘనంగా సత్కరించారు. వారికి శాలువలు కప్పి, జ్ఞాపికలను అందజేశారు. ఆ తర్వాత అక్కడ నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో ప్రధాని పాల్గొన్నారు.
అంతకు ముందు శనివారం సాయంత్రం, అధికారిక రాజదండం సెంగోల్‌ను ప్రధాని నరేంద్ర మోదీకి తిరువవదుతురై మఠాధిపతులు, వేదపండితులు అప్పగించారు. పార్లమెంట్ భవనంలో రాజదండాన్ని ప్రతిష్టిస్తారు. దీనికి ఒక్కరోజు ముందుగానే తమిళనాడుకు చెందిన స్వామిజీలు దేశ రాజధానికి చేరుకుని వేద మంత్రాల ఉచ్ఛారణ నడుమ ప్రధానికి దీనిని అందించారు.
ప్రధాని మోదీ వారికి నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆ సందర్భంగా ప్రధాని నివాసంలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, జి కిషన్ రెడ్డి ఇతరులు ఉన్నారు. తమిళనాడుకు చెందిన మత పెద్దల నుంచి రాజదండాన్ని సవినయంగా తీసుకున్న తర్వాత ప్రధాని కొద్ది సేపు మాట్లాడారు.
1947 ప్రాంతంలో తొలుత ఈ అత్యంత పురాతన రాజదండం అప్పటి తొలి ప్రధాని నెహ్రూకు ముందుగా ఈ మఠాధిపతుల నుంచి ఆహారపరంగా అందింది. తరువాత లార్డ్మౌంట్బాటెన్ చేతుల మీదుగా అధికార మార్పిడికి గుర్తుగా దీనిని స్వీకరించారు. అయితే నెహ్రూకే తెలిసిన కారణాలతో ఈ రాజదండం తర్వాత అలహాబాద్ మ్యూజియంకు చేరింది. నెహ్రూ కుటుంబ సభ్యులు ఉండే ఆనందనిలయంలో ఈ రాజదండం తరువాత మ్యూజియంలో ప్రదర్శన వస్తువు అయింది.