కొత్త పార్లమెంట్ భవనం ప్రజాస్వామ్యానికి కొత్త దేవాలయం అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ 75 ఏళ్ల తరువాత కొత్త పార్లమెంట్‌ను నిర్మించుకున్నామని చెప్పారు. పవిత్రమైన సెంగోల్‌ను పార్లమెంట్లో ప్రతిష్టించుకున్నామన చెబుతూ భారత్ అభివృద్ధి చెందితే ప్రపంచం కూడా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
కొత్త పార్లమెంట్… కొత్త భారత్‌కు కొత్త జోష్ తీసుకొచ్చిందని ప్రధాని ప్రశంసించారు. ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందని, 140 కోట్ల భారతీయుల కల సాకారమైందని, అధునిక భారత్‌కు కొత్త పార్లమెంట్ అద్దం పడుతుందని ప్రధాని కొనియాడారు. ఆత్మనిర్భర్ భారత్‌కు పార్లమెంట్ సాక్షంగా నిలుస్తుందని ప్రశంసించారు.
ప్రజాస్వామ్యానికి భారత్ తల్లి లాంటిదని పేర్కొంటూ అమృత్ కాల్లో అన్ని కఠిన సవాళ్లను అధిగమిస్తామని, ప్రజల ఆశలు, ఆకాంక్షలను కొత్త పార్లమెంట్ గౌరవిస్తుందని చెప్పారు. ‘‘ప్రపంచ ప్రజాస్వామ్యానికి భారత్ తల్లి.. పునాది కూడా. ప్రజాస్వామ్యమే మన ఆలోచన, సంప్రదాయం’’ అని తెలిపారు.
ఎన్నో ఏళ్ల విదేశీ పాలన మన ఆత్మగౌరవాన్ని మన నుంచి దూరం చేసిందని, నేడు భారతావని ఆ వలసవాద మనస్తత్వాన్ని వదిలించుకుందని చెప్పారు. కొత్త పార్లమెంట్ జాతీయ చిహ్నాలను ప్రతిబింభిస్తుందని పేర్కొంటూ పాత పార్లమెంట్లో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యేవని తెలిపారు.
రానున్న రోజుల్లో ఎంపిల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పార్లమెంట్‌ను నిర్మించామని తెలిపారు. తొమ్మిదేళ్ల బిజెపి పాలనలో ఎన్నో విజయాలు సాధించామని చెబుతూ ఇతర దేశాలతో భారత్ సాగించిన ప్రయాణం ఆదర్శంగా నిలుస్తుందని ప్రధాని స్పష్టం చేశారు.
దేశ వికాస యాత్రలో ఎప్పటికీ నిలిచిపోయే కొన్ని గడియలు వస్తాయని, అమృతోత్సవ వేళ చరిత్రాత్మక ఘటనలో ప్రజలు భాగస్వాములయ్యారని ప్రధాని వ్యాఖ్యానించారు. ఇది కేవలం భవనం కాదని, 140 కోట్ల ప్రజల ఆకాంక్షల, కలలకు ప్రతీక అని చెప్పారు. ప్రపంచానికి భారత్ దృఢ సంకల్ప సందేశం ఈ కొత్తభవనం ఇస్తుందని తెలిపారు.
స్వాతంత్ర్య సమరయోధుల కలల సాకార మాధ్యమంగా, ఆత్మనిర్భర భారత్‌కు సాక్షిగా ఇది నిలుస్తుందని మోదీ పేర్కొన్నారు. నవ భారత్ కొత్త మార్గాలు నిర్దేశించుకుని.. కొత్త ఆలోచనలు, సంకల్పంతో భారత్ ప్రగతి పథాన పయనిస్తోందని చెప్పారు. ప్రపంచం మొత్తం మన దేశ సంకల్పం, అభివృద్ధిని గమనిస్తోందని ప్రధాని వివరించారు
ఇక్కడ జరిగే నిర్ణయాలు భారత్ ఉజ్వల భవిష్యత్తును నిర్ణయిస్తాయని, తాడిత, పీడిత ప్రజలకు న్యాయం జరుగుతుందని మోదీ ఆకాక్షించారు. భారత్ మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవం సందర్భంగా రూ.75 నాణెంతో పాటు స్టాంపును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు. దీనికి ముందు కొత్తగా నిర్మించిన పార్లమెంటుకు సంబంధించిన శిలాఫలకాన్ని ప్రధాని ఆవిష్కరించారు. కొత్త పార్లమెంటును జాతికి అంకితం చేశారు.