మణిపూర్లో చెలరేగిన హింసపై జుడిషియల్ విచారణకు కేంద్రం ఆదేశించింది. ప్రత్యేక సీబీఐ బృందం చేపడుతున్న విచారణను పర్యవేక్షించేందుకు హైకోర్టు రిటైర్డ్ జడ్జీ నేతృత్వంలో ఓ కమిటీని నియమించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు.
మణిపూర్లో జరుగుతున్న వర్గ పోరును దర్యాప్తు చేసేందుకు పలు ఏజెన్సీలు ఇప్పటికే పనిచేస్తున్నాయని, ఆరు సంఘటనల్లో కుట్ర ఉన్నట్లు సీబీఐ ఉన్నత స్థాయి దర్యాప్తులో తేలిందని, అయితే విచారణ నిష్పక్షపాతంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని షా తెలిపారు. మణిపూర్ సంక్షోభాన్ని చర్చలతోనే పరిష్కరించే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
సుమారు నెలరోజులుగా అల్లర్లతో అట్టుడికిపోతున్న మణిపూర్ లో నాలుగు రోజులుగా పర్యటిస్తున్న అమిత్ షా గురువారం మీడియాతో మాట్లాడుతూ మణిపూర్లో హింసను నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకొంటున్నామని చెప్పారు. హింసలో ప్రాణాలు కోల్పోయిన వారికి కేంద్రం రూ. 5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ 5 లక్షలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
రాష్ట్ర గవర్నర్ నేతృత్వంలో పీస్ కమిటీ ఉంటుందని ప్రకటించారు. అల్లర్లలో గాయపడ్డవారికి చికిత్స అందించేందుకు 8 డాక్టర్ల బృందంలో ప్రస్తుతం మణిపూర్లో ఉన్నాయి. నకిలీ వార్తల పట్ల దృష్టి పెట్టవద్దు అని మణిపూర్ ప్రజల్ని ఆయన కోరారు. ఆయుధాలతో తిరుగుతున్నవారు వాటిని పోలీసులకు వెంటనే అప్పగించాలని హెచ్చరించారు.
రేపటి నుంచి కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభంకానున్నట్లు మంత్రి వెల్లడించారు. విద్యాశాఖకు చెందిన అధికారులు రాష్ట్రంలో పర్యటిస్తారని, నిరాటంకంగా విద్యాబోధన కొనసాగించేందుకు కావాల్సిన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. మణిపూర్ కొత్త డీజీపీగా రాజీవ్ సింగ్ను నియమించారు. హోంశాఖ ఓఎస్డీగా ప్రస్తుత డిజిపి పీ డొంగోల్ను నియమించారు.