ఒడిశాలో శుక్రవారం జరిగిన రైళ్ల ప్రమాదంలో మూడు రైళ్లు ఢీకొనలేదని, లేవలం కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ మాత్రమే ప్రమాదానికి గురైందని రైల్వే బోర్డు ఆపరేషన్, బిజినెస్ డెవలప్మెంట్ సభ్యురాలు జయ వర్మ సిన్హా స్పష్టం చేశారు. రైళ్ల వేగం అనుమతికి లోబడి ఉందని, అయితే సిగ్నలింగ్ లోపం ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోందని ఆమె తెలిపారు.
ముడి ఇనుముతో ఉన్న గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టడంతో తీవ్రత ఎక్కవైందని ఆమె చెప్పారు. ఒడిశాలోని బహనగ బజార్ స్టేషన్లో నాలుగు రైల్వే లైన్లు ఉన్నాయని చెప్పారు. వీటిలో రెండు స్ట్రెయిట్ మెయిన్ లైన్స్ అని, మిగిలిన రెండూ ఇరువైపులా ఉన్న లూప్ లైన్స్ అని చెప్పారు.
మెయిన్ లైన్స్ రెండూ లూప్ లైన్లకు మధ్యలో ఉన్నాయని, ఏదైనా రైలును ఈ స్టేషన్లో ఆపాలంటే లూప్ లైన్లో ఆపుతామని చెప్పారు. ఈ ప్రమాదం జరిగినపుడు రెండు మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఎదురెదురుగా వచ్చాయని ఆమె వివరించారు. ఆ రెండు రైళ్లు కూడా అనుమతించిన వేగంలోనే నడుస్తున్నాయని, అతివేగంతో ప్రమాదం జరగలేదని ఆమె స్పష్టం చేశారు.
శుక్రవారం సాయంత్రం ప్రమాదం జరిగినపుడు రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు దారి ఇవ్వడం కోసం మరో రెండు రైళ్లను నిలిపి ఉంచినట్లు తెలిపారు. ఈ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఈ స్టేషన్లో ఆగవని చెప్పారు. లూప్‌లైన్లలో రెండు గూడ్స్ రైళ్లు ఉన్నాయని పేర్కొన్నారు.
కోరమాండల్, బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్ రైళ్ల కోసం రెండు మెయిన్ లైన్లను క్లియర్ చేసి ఉంచినట్లు తెలిపారు. అంతా సజావుగానే సిద్ధంగా ఉందని, ఆకుపచ్చ సిగ్నల్ ఉందని చెప్పారు. గ్రీన్ సిగ్నల్ అంటే రైలును గరిష్ఠ వేగంతో నడపవచ్చునని చెప్పారు.
ఏదో కారణం చేత కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురైందన్నారు. ఈ కారణం ఏమిటో తెలుసుకునేందుకు దర్యాప్తు జరుగుతోందన్నారు. ప్రాథమిక నివేదిక ప్రకారం సిగ్నలింగ్ లోపం ఉన్నట్లు సంకేతాలు వచ్చాయన్నారు. అయితే ఈ విషయంలో తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయబోనని చెప్పారు
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో చాలా సురక్షితమైన ఎల్‌హెచ్‌బీ బోగీలు ఉన్నాయన్నారు. అవి తలక్రిందులయ్యే అవకాశం ఉండదన్నారు. కానీ ప్రస్తుత సందర్భంలో మొత్తం ప్రభావం కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌పైనే పడినందువల్ల ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పారు. ఇటువంటి ప్రమాదాన్ని ఏ టెక్నాలజీ అయినా కాపాడజాలదని వివరించారు.
ఇదిలావుండగా, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, ఈ ప్రమాదానికి మూల కారణాన్ని గుర్తించామన్నారు. దర్యాప్తు పూర్తయిందని, రైల్ సేఫ్టీ కమిషనర్ సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇస్తారని తెలిపారు. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌లో మార్పుల వల్ల ఈ దారుణం జరిగిందన్నారు. ప్రస్తుతం ట్రాక్‌లు, రైల్వే సేవల పునరుద్ధరణపైనే దృష్టి సారించామని చెప్పారు.