బిపోర్జాయ్ తుఫాను అంతకంతకూ తీవ్రమౌతూ గుజరాత్‌పై విరుచుకుపడుతోందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) బుధవారం తెలిపింది. గుజరాత్‌లోని సౌరాష్ర, కచ్ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. జునాగఢ్, ద్వారక తీర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.
అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జోయ్ తుఫాను తీరం దిశగా ముంచుకొస్తోంది. గురువారం సాయంత్రం తుఫాను గుజరాత్ లోని జఖౌ సమీపంలో తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో ఈ తుఫాను కలిగించే నష్టాన్ని వాతావరణ శాఖ అంచనా వేసింది. తీర ప్రాంత రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కచ్ సహా పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. భుజ్ విమానాశ్రయాన్ని జూలై 16 వరకు క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. బిపోర్ జాయ్ తుపాను ప్రభావం దృష్ట్యా హోమ్ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా పడింది.
బిపర్జాయ్ తుపాను తీవ్ర రూపం దాల్చటంతో దీనిపై ఉన్నత స్థాయి సమీక్షలు, అధికార యంత్రాంగంతో నిరంతం అందుబాటులో ఉండి సహాయక చర్యల ఆదేశాలకు రెడీగా ఉండాల్సిన అవసరం ఉంది. దీంతో షా ఆ పనుల్లో బిజీగా ఉండాల్సి రావటంతో తెలంగాణ పర్యటన మరోసారి రద్దు అయ్యింది.
ద్వారకా జిల్లాలో సుమారు 400కు పైగా రక్షణ శిబిరాలను ఏర్పాటు చేశామని చెప్పారు. భుజ్‌లోని జఖౌ ఓడరేవులో పెద్ద సంఖ్యలో పడవలు చేరుకున్నాయి. రాజ్‌కోట్‌లోని రిలే టవర్‌ను కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు. తుఫాను ధాటికి కూలిపోయి ప్రమాదం ఉన్నందున టవర్‌ను తొలగించామని, త్వరలో కొత్త టవర్‌ను నిర్మిస్తామని ఆకాశవాణి రాజ్‌కోట్ డైరెక్టర్ రమేష్ చంద్ర వివరించారు.
ప్రధాని సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైందని, ఎన్డిఆర్ఎఫ్; ఎస్డి ఆర్ఎఫ్ సహాయక బృందాలను మోహరించామని కేంద్రమంత్రి పురషోత్తమ్ రూపాలా పేర్కొన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ కచ్ లోని ఆసుపత్రులను తనిఖీ చేశారు. ఆక్సిజన్, వెంటిలెటర్, క్రిటికల్ కేర్ బెడ్స్ తదితర వివరాలపై ఆసుపత్రి వర్గాల నుండి ఆరా తీశారు. సైక్లోన్ అనంతరం సిద్ధంగా ఉండాలని, ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉండాలని ఆదేశించారు.
బిపర్ జోయ్ తుఫాను నేపథ్యంలో గుజరాత్ తీర ప్రాంతాల్లో 4500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఎన్డీఆర్ఎఫ్ ప్రకటించింది. వీరికి ద్వారకలో షెల్టర్ హోమ్స్ సిద్ధం చేశారు. సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లోని ఏడు జిల్లాల నుండి మొత్తం 47000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 18 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ను సైక్లోన్ ప్రభావిత ప్రాంతాల్లో సిద్ధం చేశారు. తుఫాను నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 69 రైళ్లను రద్దు చేశారు.