ఉత్తర ప్రదేశ్ అంతటా ‘అవినీతి సుగంధం’ వెదజల్లారు అంటూ రాష్ట్రంలో 2017లో బిజెపి అధికారం చేపట్టడానికి ముందు సమాజ్‌వాదీపార్టీ(ఎస్పి)ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. మంగళవారం కాన్పూర్‌లో 9 కిలోమీటర్ల మెట్రోలైన్‌ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ప్రసంగించారు.
ఇటీవల జిఎస్టి నిఘా బృందాలు సుగంధ ద్రవ్యాల వ్యాపారి పీయూష్‌జైన్‌కు చెందిన కాన్పూర్,కనౌజ్ల్లోని ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించాయి. ఈ సోదాల్లో ఇప్పటివరకు రూ.257 కోట్ల నగదు (ఇందులో రూ.194.45 కోట్లు అక్రమ నగదు), 25కిలోల బంగారం,250 కిలోల వెండి, రూ.6 కోట్ల విలువైన గంధంచెక్కల నూనెను జప్తు చేసినట్టు జిఎస్టి అధికారులు తెలిపారు.
పీయూష్‌జైన్‌కు ఎస్పితో సంబంధాలున్నాయని జరుగుతున్న ప్రచారాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఇప్పుడు వారి నోళ్లకు తాళాలు పడ్డాయంటూ ఎస్పి నేతలనుద్దేశించి ప్రధాని ధ్వజమెత్తారు. అక్రమ నగదును తమ ఖాతాలో వేసుకునేందుకు ముందుకు రాలేకపోతున్నారంటూ విమర్శించారు.
తమ (బిజెపి) ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ హయాంలో జరిగిన అభివృద్ధి ప్రాజెక్టులన్నీ వారి హయాంలోనే(ఎస్పి హయాం..2012-17) చేపట్టామంటూ చెబుతున్నారని ఎస్పి అధ్యక్షుడు అఖిలేశ్యాదవ్నుద్దేశిస్తూ ప్రధాని విమర్శలు గుప్పించారు. ఇప్పుడు నోట్ల కట్టల్ని వెలికితీసిన ఘనత కూడా తమదే అంటారేమో అంటూ ఎద్దేవా చేశారు.
దేశమంతా చూసింది పర్వతమంత నోట్ల కట్టల్ని.. ఇది వారు సాధించిందే, ఇదే వారి వాస్తవ రూపం అంటూ ప్రధాని విమర్శించారు. ఇప్పటికే జైన్‌ను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపారు.
కాన్పూర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ను ప్రారంభించి, ఆ తర్వాత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి ఆయన మెట్రో రైలులో ప్రయాణించారు. ఐఐటీ-కాన్పూర్ నుంచి మోతీ జీల్ వరకూ సుమారు 9 కిలోమీటర్ల పొడవైన రైల్ ప్రాజెక్టు ఇది. మొత్తం 32 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్టును రూ 11,000 కోట్లతో పూర్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పూరి పాల్గొన్నారు.