బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్‌రామ్ మాంఝీకి చెందిన హిందుస్థానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) సోమవారం నితీశ్ కుమార్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. మద్దతు ఉపసంహరణ లేఖను అందజేసేందుకు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌తో అపాయింట్మెంట్ కోరినట్లు పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాంఝీ కుమారుడు సంతోష్ సుమన్ తెలిపారు.
జేడీయూలో తమ పార్టీని విలీనం చేయబోమని సంతోష్ స్పష్టం చేశారు.మంత్రి పదవికి రాజీనామా చేసిన సుమన్, భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోవడానికి హెచ్‌ఏఎంజాతీయ కార్యవర్గం సమావేశం అవుతుందని చెప్పారు. “మేము థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ఎంపికను కూడా తెరిచి ఉంచుతున్నాము” అని హెచ్ఏఎం అధ్యక్షుడు చెప్పారు.
ఎనిమిదేళ్ల క్రితం స్థాపించబడినప్పటి నుంచి చాలాసార్లు మిత్రపక్షాలు మార్చింది హిందుస్థానీ అవామ్ మోర్చా పార్టీ. బీజేపీ జెడియుని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని నితీష్ కుమార్ ఆరోపిస్తూ ఆర్జేడీతో కలిసి మహాగఠబందన్ సంకిర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. హిందుస్థానీ అవామ్ మోర్చా పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు గతేడాది ‘మహాగఠబంధన్’ కూటమిలో చేరారు.
243 మంది సభ్యులున్న అసెంబ్లీలో అధికార కూటమికి దాదాపు 160 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో జెడియు, ఆర్జేడీ, కాంగ్రెస్‌తో పాటు బయటి నుంచి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న మూడు వామపక్ష పార్టీలు ఉన్నాయి. బీహార్ లో 2020లో అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ 43 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 74 సీట్లలో విజయం సాధించింది. ఆర్జేడీ 75 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 19 సీట్లను గెలుచుకుంది. ఎల్జేపీ ఒక సీట్ గెలువగా, ఇతరులు 31 స్థానాల్లో గెలిచారు.