`కాషాయ ఉగ్రవాదం’ అంటూ కీలక ఆర్ఎస్ఎస్, బిజెపి, ఇతర హిందుత్వ నాయకులను ఇరికించాలని యుపిఎ ప్రభుత్వం జరిపిన కుట్రలో భాగంగా 2008 మాలేగాం పేలుడు కేసులో పలువురిని నిందితులుగా రాజకీయ దురుద్దేశ్యంలోనే చేర్చారని ఇప్పుడు స్పష్టమైనది.
నలుగురు ఆర్ఎస్ఎస్ నేతలు, యూపీ సీఎం ఆదిత్యనాథ్ పేర్లను చెప్పమని ముంబై ఏటీఎస్ (యాంటీ టెర్రరిజం స్క్వాడ్) తనను బెదిరించిందని 2008 మాలేగాం పేలుడు కేసులో సాక్షి మంగళవారం కోర్టుకు చెప్పారు. నాడు ఆ కేసును ప్రస్తుతం పలు కేసులు ఎదుర్కొంటున్న పరమ్‌బీర్ సింగ్ పర్యవేక్షించారు.
నాడు సదరు సాక్షి స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. అయితే హఠాత్తుగా తనను బెదిరించి పేర్లు చెప్పించారని సాక్షి కోర్టుకు చెప్పడం కలకలం రేపింది. కేసుపై ఎన్ఐఏ కోర్టు విచారణ జరుపుతోంది. పరమ్‌బీర్ సహా మరో అధికారి యోగి, ఆర్ఎస్ఎస్ నేతల పేర్లను చెప్పమని బెదిరించారని తాజా విచారణలో సాక్షి కోర్టుకు విన్నవించారు.
తనను ఏటీఎస్ చిత్రహింసలకు గురిచేసిందని చెప్పడంతో సాక్షి ఏటీఎస్ ముందు ఇచ్చిన స్టేట్మెంట్ను అంగీకరించమని కోర్టు ప్రకటించింది. ఇంతవరకు ఈ కేసులో 220 సాక్షులను విచారించారు. వీరిలో 15మంది అడ్డం తిరిగారు. దోపిడీ, ఇతర కేసులు ఎదుర్కొంటున్న పరమ్ బీర్ సింగ్‌ను ఈ మధ్యనే సస్పెండ్ చేశారు.
ఈ నేపథ్యంలో తమపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు మన్మోహన్, సోనియా గాంధీ, రాహుల్, సల్మాన్‌ఖుర్షిద్, ప్రియాంక క్షమాపణలు చెప్పాలని ఆర్ఎస్ఎస్ నేత ఇంద్రేశ్ కుమార్ డిమాండ్ చేశారు. యూపీఏ హయాంలో రాజకీయ కుట్రతో ఈ కేసును రిజిస్టర్ చేశారని మండిపడ్డారు.
కాంగ్రెస్ కుట్రలను తనను బెదిరించారన్న సాక్షి స్టేట్మెంట్ బహిర్గతం చేసిందని పేర్కొంటూ నిజానిజాలు తెలుసుకోకుండా ఇతర ప్రతిపక్షాలు సైతం కాంగ్రెస్‌కు వత్తాసు పలికాయని ఆయన విమర్శించారు. ఆ సమయంలో `కాషాయ ఉగ్రవాదం’కు సంబంధించిన కేసులన్నీ కాంగ్రెస్ తన నీచపు రాజకీయాలలో భాగంగా పన్నిన కుట్ర అని ఇది ఇప్పుడు ఋజువైన్నట్లు ఆర్ఎస్ఎస్ నేత స్పష్టం చేశారు.
ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్న” ఇతర రాజకీయ పార్టీలను, వాటి నాయకులను కూడా ఆయన ఈ సందర్భంగా నిందించారు. వారు కాంగ్రెస్, దాని సంకీర్ణ ప్రభుత్వ “మురికి రాజకీయాలు, అబద్ధపు కుట్ర” పక్షాన నిలబడి బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలను కాషాయ ఉగ్రవాద కేసుల్లో ఇరికించడం ద్వారా “పెద్ద పాపం, నేరం” కూడా చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అప్పటి యుపిఎ హయాంలో బిజెపి, ఆర్ఎస్ఎస్ నాయకులను కాషాయ ఉగ్రవాద కేసుల్లో ఇరికించేందుకు తన శక్తి, యుక్తులను ప్రయోగించింది. కానీ వారి వద్ద ఎటువంటి ఆధారాలు లేనందున “ఏ ఎఫ్ఐఆర్లలో మా పేర్లను” నమోదు చేయలేకపోయారని ఇంద్రేశ్ కుమార్ పేర్కొన్నారు.
“కాషాయ ఉగ్రవాదం కధనం సృష్టించడంలో” పాలుపంచుకున్న లేదా “అలాంటి అమానవీయ రాజకీయాలకు” మద్దతు ఇచ్చిన పార్టీలు, నాయకులందరికీ “ప్రజాస్వామ్యయుతం” గుణపాఠం చెప్పాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సెప్టెంబరు 29, 2008న, ముంబైకి 200 కి.మీ దూరంలో ఉన్న నాసిక్‌లోని మాలెగావ్ పట్టణంలోని ఒక మసీదు సమీపంలో మోటారు సైకిల్‌పై పేలుడు పదార్థం పేలడంతో ఆరుగురు మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు.
ఈ కేసులో నిందితులుగా ఉన్న వారిలో లోక్‌సభ సభ్యురాలు ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్, షుదాకర్ దివేది, మేజర్ రమేష్ ఉపాధ్యాయ్ (రిటైర్డ్), అజయ్ రాహిర్కర్, సుధాకర్ ద్వివేది, సుధాకర్ చతుర్వేది, సమీర్ కులకర్ణిలు బెయిల్‌పై బయట ఉన్నారు.