బీహార్ రాజధాని పాట్నాలో శుక్రవారం నిర్వహించిన ప్రతిపక్షాల ఐక్యత తొలి సమావేశంలో 2024 ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేసి బిజెపిని ఓడించాలని నిర్ణయించారు. దేశంలో ఉన్న 17 పార్టీల నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దింపాలన్న లక్ష్యంతో ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కావాలని నిర్ణయించారు.
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. 2024 ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఆయా రాష్ట్రాల్లో కలిసికట్టుగా ఏవిధంగా పోరాడాలనే విషయంపై జులై 10- 12 తేదీలలో హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో సమావేశమై ఒక ఎజెండాను రూపొందిస్తామని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్ తెలిపారు.
ప్రస్తుతం పాట్నాలో జరిగిన సమావేశం ప్రతిపక్షాల ఐక్యతకు తొలి అడుగు మాత్రమేనని భేటీలో పాల్గొన్న నేతలు వెల్లడించారు. అయితే వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలు అన్నీ కలిసికట్టుగా పోరాడాలని ఈ సమావేశంలో అందరు నేతలు ఒక అభిప్రాయానికి వచ్చారు. తర్వాతి సమావేశం హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో జులైలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
జులై 10 నుంచి 12 వరకు 3 రోజుల పాటు ఉండవచ్చని తెలుస్తోంది. దాదాపు 450 స్థానాల్లో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలకు సంబంధించి ఒకే ఒక అభ్యర్థిని బరిలోకి దింపాలని నిర్ణయించనున్నట్లు సమాచారం. అయితే ఆయా రాష్ట్రాల్లో ఆయా స్థానాల్లో బీజేపీ పోటీలో లేని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి, స్థానిక పార్టీలకు మధ్య పోరాటం ఉన్న నేపథ్యంలో అక్కడ ఏం చేయాలన్న దానిపై తదుపరి సిమ్లా సమావేశంలో కూలంకషంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఇది సిద్ధాంతాల మధ్య పోరు అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. నిజానికి తమలో విభేదాలు ఉన్నప్పటికీ కలిసికట్టుగా పోరాడాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. సిద్ధాంతాలపై పరస్పరం చర్చించుకుని వాటిని పరిరక్షించుకునేందుకు కృషిచేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
విపక్షాలన్నీ కలిసికట్టుగానే ఉన్నాయని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో కలిసికట్టుగానే పోరాటం చేస్తాయని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. జమ్ము కశ్మీర్లో విచ్ఛిన్నమైన ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు విపక్ష పార్టీలతో కలిసి పాట్నా సమావేశంలో పాల్గొన్నట్లు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ప్రజాస్వామ్యం హత్యకు గురైన జమ్ము కశ్మీర్లో తాను, మెహబూబూ ముఫ్తీ ఉన్నామని పేర్కొన్నారు.
అయితే ఈ సమావేశానికి హాజరైన పార్టీల్లో కొన్ని పార్టీలకు విబేధాలు ఉండటం ఉమ్మడి ప్రతిపక్ష పోరుకు కొంత ఇబ్బందులు కలగవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధానంగా ఢిల్లీ ఆర్డినెన్స్ విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి పట్ల ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఢిల్లీ ఆర్డినెన్స్ విషయంలో తమకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటిస్తేనే తదుపరి విపక్షాల ఐక్యత కోసం నిర్వహించే సిమ్లా సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ పాల్గొంటుందని చెప్పినట్లు తెలుస్తోంది.
జేడీయూ అధినేత నితీశ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 16 పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తీ మోర్చా అధినేత హేమంత్ సోరెన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆయన కుమార్తె సుప్రియా సూలే, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే ఉన్నారు.
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీ యాదవ్, వామపక్షాల నేతలు, నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత ఒమర్ అబ్దుల్లా, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఈ భేటీకి హాజరయ్యారు.