మణిపూర్ పరిస్థితులను చక్కదిద్దేందుకు అఖిలపక్షాన్ని పంపాలని వివిధ రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. మణిపూర్ హింసను నిలువరించడంలో విఫలమైన ముఖ్యమంత్రి బీరెన్ సింగ్‌ను తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాయి. శనివారంపార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన మణిపూర్ పరిస్థితులపై అఖిలపక్ష సమావేశం జరిగింది.
మణిపూర్‌లో పరిస్థితి అదుపులో లేదని అమిత్ షా తొలిసారి బహిరంగంగా అంగీకరించారు. తనను విశ్వసించాలని, ఈ విషయంపై ప్రధాని సూచనలు ఇస్తున్నారని అమిత్ షా పేర్కొన్నారు. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు 131 మంది మరణించారని, హింస, దోపిడీ సహా 5,036 ఘటనలు నమోదయ్యాయని తెలిపారు. 5,889 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా, 144 మందిని అరెస్టు చేశారు.
వివాదాలకు కారణమైన కేసును హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుకు బదిలీ చేసేలా చర్యలు తీసుకోవచ్చని అమిత్ షా తెలిపారు. కేంద్ర సాయుధ బలగాలను వెంటనే వెనక్కి పంపాలన్నారు. పరిస్థితిని చక్కదిద్దడంలో, సంక్షోభాన్ని నిలువరించడంలో విఫలమైనట్లు ముఖ్యమంత్రి స్వయంగా రెండుసార్లు బహిరంగంగా అంగీకరించారని, ప్రజలను క్షమించాలని కూడా కోరారని కాంగ్రెస్ నేత, మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబీ సింగ్ గుర్తు చేశారు.
కుకీ ప్రయోజనాలను సమర్థిస్తున్నామని చెప్పుకునే కొన్ని మిలిటెంట్ గ్రూపులతో త్రైపాక్షిక ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం మార్చి 11న ఏకపక్షంగా ఉపసంహరించుకుందని తెలిపారు. ఈ చర్యను తరువాత కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తిరస్కరించిందని, అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిందని పేర్కొన్నారు. మణిపూర్ ఐక్యత, ప్రాదేశిక సమగ్రతపై ఏ విధంగానూ రాజీపడవద్దని స్పష్టం చేశారు.
పోలీసుల ఆయుధాలను మిలిటెంట్లు స్వాధీనం చేసుకోవడంపై కేంద్రం మౌనం వహించడాన్ని సిపిఎం రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టాస్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని మార్చాలని బిజెపి ఎమ్మెల్యేలు స్వయంగా డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. మేఘాలయ, సిక్కిం ముఖ్యమంత్రులను సమావేశానికి ఆహ్వానించి, మణిపూర్ ముఖ్యమంత్రిని ఆహ్వానించకపోవడంపై బ్రిట్టాస్ ప్రశ్నించారు.
శివసేన (ఉద్దవ్ థాకరే) ఎంపి ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ మణిపూర్ పరిస్థితిపై అన్ని పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయని, సాధారణ స్థితికి తీసుకురావడానికి తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరామని చెప్పారు. డిఎంకె నేత తిరుచ్చి శివ మాట్లాడుతూ ”శాంతిని పునరుద్ధరిస్తామని, తనను నమ్మాలని హోం మంత్రి అన్నారు. ప్రధాని స్పందించకపోవడంపై నిలదీశాం. అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని మణిపూర్ పంపాల్సిందిగా కోరాం. పాలనా వైఫల్యం, కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే అక్కడ హింస చెలరేగింది” అని అన్నారు. బిఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ మణిపూర్ ప్రజలకు భరోసా, ధైర్యం కల్పించే బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపై ఉందని అఖిలపక్ష సమావేశంలో చెప్పామని తెలిపారు.
ఈ సమావేశానికి జెపి నడ్డా (బిజెపి), మేఘాలయ సిఎం కాన్రాడ్ సంగ్మా (ఎన్‌పిపి), సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ (సిక్కిం క్రాంతికారి మోర్చా), , బీరేంద్ర ప్రసాద్ బైశ్యా (అసోం గణ పరిషత్), డెరెక్ ఒబ్రెయిన్ (టిఎంసి), రామ్ గోపాల్ యాదవ్ (ఎస్పి), బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (వైసిపి), వినోద్ కుమార్ (బిఆర్ఎస్), సంజరు సింగ్ (ఆప్), పినాకి మిశ్రా (బిజెడి), తంబిదురై (అన్నాడిఎంకె), నరేంద్ర వర్మ (ఎన్‌సిపి), అనిల్ ప్రసాద్ (జెడియు), పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, కేంద్ర హోం సహాయ మంత్రులు నిత్యానంద్ రారు, అజరు కుమార్ మిశ్రా, కార్యదర్శి అజరు భల్లా, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ దేకా తదితరులు హాజరయ్యారు.