సుమారు నెలరోజులుగా హింసాకాండతో రగిలిపోతున్న మణిపూర్ లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన రెండు రోజుల పర్యటన గురువారం ఉద్రిక్తల నడుమ ప్రారంభమైంది. తెగల మధ్య ఘర్షణలతో రగిలిపోతున్న మణిపూర్‌లోని ఉద్రిక్తతల కేంద్రం చురాచాంద్‌పూర్‌లో ఆయన సహాయక శిబిరానికి వెళ్లి నిర్వాసితులను పరామర్శించారు.
అనుకున్న సమయానికి పలు గంటల ఆలస్యంగా ఆయన ఈ క్యాంప్ చేరుకోవల్సి వచ్చింది. శాంతిభద్రతల పరిస్థితి, గ్రనేడ్ దాడుల భయాలు ఉన్నందున రాహుల్ గాంధీ కాన్వాయ్‌ను ముందుకు వెళ్లకుండా అంతకు ముందు రాష్ట్ర పోలీసు బృందాలు మధ్యలోనే అడ్డుకున్నాయి
ఈ ప్రాంతం వివాదానికి కేంద్ర బిందువుగా ఉందని, ఎప్పుడేం జరుగుతుందో తెలియని స్థితిలో అక్కడికి నేతలను పంపించడం బాధ్యతారాహిత్యం అవుతుందని అధికారులు తెలిపారు.ఇంఫాల్‌కు 20 కిలోమీటర్ల దూరంలోని బిష్ణుపూర్ వద్ద రాహుల్‌ను నిలిపివేశారు.
కాన్వాయ్‌పై దాడి జరిగితే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. క్యాంప్ సందర్శనకు వెళ్లాలనుకుంటే హెలికాప్టర్ బెటర్ అని తెలిపారు. తరువాత ఆయన ఇంఫాల్‌కు చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా చురాచంద్పూర్ వెళ్లారు. మణిపూర్ హింసాకాండ బాధితులకు బాసటగా నిలిచేందుకు వచ్చిన తనను రాష్ట్ర ప్రభుత్వం నిలువరించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
మణిపూర్‌కు చెందిన తన సోదరులు, సోదరీమణులందరూ చెప్పే విషయాలను వినేందుకు వచ్చానని, వారంతా తనను ప్రేమతో అక్కున చేర్చుకున్నారని ట్వీట్లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తనను నిలువరించడం దురదృష్టకరమని, మణిపూర్ గాయం మానాల్సి ఉందని, శాంతి స్ధాపనే మన ఏకైక అజెండాగా ఉండాలని రాహుల్ ఆకాంక్షించారు.
రాహుల్ గాంధీని ఎందుకు అడ్డగిస్తున్నారని నిరసిస్తూ బిష్ణుపూర్‌లో కొందరు ధర్నాలకు దిగారు. మరికొందరు ఆయనను అనుమించరాదని పట్టుపట్టారు. ఈ దశలో ఉద్రిక్తత నెలకొంది. గుంపులు మరింతగా చేరకుండా పోలీసులు ముందు హెచ్చరికలు వెలువరించి, తర్వాత భాష్పవాయువు ప్రయోగించి వారిని అక్కడి నుంచి పంపించివేశారు.
