ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంపై డ్రోన్ కలకలం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో.. మోదీ నివాసంపై డ్రోన్ తిరుగుతున్నట్టు దిల్లీ పోలీసులకు సమాచారం అందింది. ప్రధాని మోదీ నివాసం రెడ్ నో ఫ్లై జోన్/ నో డ్రోన్ జోన్ కిందకు వస్తుంది. అలాంటిది, ఎన్నడు లేని విధంగా.. మోదీ నివాసంపై డ్రోన్ కనిపించింది.
ప్రధాని నరేంద్ర మోదీకి రక్షణ కల్పించే ఇలైట్ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఈ డ్రోన్‌ను గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. డ్రోన్‌ను కనిపెట్టేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
“ప్రధాని నివాసానికి సమీపంలో అన్ఐడెన్టిఫైడ్ ప్లయింగ్ ఆబ్జెక్ట్ తిరుగుతున్నట్టు సమాచారం అందింది. వెంటనే స్పందించి సమీప ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టాము. కానీ ఏం లభించలేదు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాము. వారు కూడా ఎలాంటి ఫ్లయింగ్ ఆబ్జెక్ట్‌ను గుర్తించలేదు,” అని దిల్లీ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు.
అయితే ఇప్పటివరకు సంబంధిత డ్రోన్‌ను పోలీసులు పట్టుకోలేదు. ఈ డ్రోన్ ఎవరిది? అసలు నో ఫ్లై జోన్లోకి ఎలా వచ్చింది? దీని వెనుక ఎవరున్నారు? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది. ప్రధాని మోదీకి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ నిరంతరం భద్రత కల్పిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఈ టీమే డ్రోన్‌ని గుర్తించింది. ఇప్పుడు ఢిల్లీ పోలీసులు స్పెషల్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఇప్పటివరకూ ఏ డ్రోనూ కనిపించలేదు. అసలు ఇంటిపై ఎగిరింది డ్రోనేనా అనే డౌట్ కూడా ఉంది.
